బీఆర్ఎస్ ఎంపీకి షాక్.. సాయిసింధు ఫౌండేషన్ కు భూకేటాయింపు రద్దు

బీఆర్ఎస్ ఎంపీకి షాక్.. సాయిసింధు ఫౌండేషన్ కు భూకేటాయింపు రద్దు

బీఆర్ఎస్ ఎంపీ, హెటిరో గ్రూపు చైర్మన్ బి. పార్థసారథి రెడ్డి మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న సాయి సింధు ఫౌండేషన్ కు రాష్ర్ట ప్రభుత్వం కేటాయించిన భూమిని తెలంగాణ హైకోర్టు సోమవారం (జూన్ 5న) రద్దు చేసింది. క్యాన్సర్ ఆస్పత్రి కోసమని హైదరాబాద్ ఖానామెట్ వద్ద ఖరీదైన 15 ఎకరాల భూమిను కేటాయిస్తూ..  రాష్ర్ట ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. 

క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసమని సాయి సింధు ఫౌండేషన్ కు 2018లో రాష్ర్ట ప్రభుత్వం ఖానామెట్ లో 15 ఎకరాల భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేసింది. 2018 జీవో ప్రకారం 60 ఏళ్లలో కట్టే లీజు కేవలం కోటి 47 లక్షలు మాత్రమే. 

ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో 2019లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. రాష్ర్ట ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ 2019లో ది రైట్ సొసైటీ అనే స్వచ్చంధ సంస్థతో పాటు హైదరాబాద్ కు చెందిన ఊర్మిళ, సురేష్ కుమార్ అనే వ్యక్తులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 

ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం తీర్పునిచ్చింది. సాయి సింధు ఫౌండేషన్ కు భూమి కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను న్యాయస్థానం కొట్టివేసింది. భూ కేటాయింపుల విధానానికి అనుగుణంగా పునః పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.