హైదరాబాద్, వెలుగు: మొయినాబాద్ ఫామ్హౌస్డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. డ్రగ్స్ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కె. సుజన మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రద్యుమ్న కుమార్ రెడ్డి వాదిస్తూ.. ఈ కేసులో విచారణ ఇప్పటికే పూర్తయిందని, రోహిత్ రెడ్డి మార్చి 15 నుంచి జైలులోనే ఉన్నారని తెలిపారు.
ఆయన వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ మొత్తం వ్యవహారానికి రోహిత్ రెడ్డే సూత్రధారి అని, ఆయన పోలీసులపై కాల్పులకు ఉసిగొల్పారని ఆరోపించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కొకైన్ 0.26 గ్రాములేనని, పోలీసులపై కాల్పులు జరిపినట్లు సరైన ఆధారాలు లేవని జడ్జి అభిప్రాయపడ్డారు. రోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు.
రూ.25 వేల వ్యక్తిగత బాండ్‌తోపాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించారు. 8 వారాల పాటు ప్రతి బుధవారం ఎస్‌హెచ్‌ఓ ముందు హాజరుకావాలన్నారు. పాస్‌పోర్టును కోర్టుకు స్వాధీనం చేయాలని..కోర్టు అనుమతి లేకుండా పరిధి దాటి వెళ్లొద్దని, సాక్షులను ప్రభావితం చేయొద్దని షరతులు విధించారు.

