హైదరాబాద్, వెలుగు: శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రూ.58 కోట్లు విడుదల చేసి, బాధితులకు ఇవ్వకపోవడాన్ని సవాల్‌చేస్తూ కరీంనగర్‌కు చెందిన రామగిరి నందయ్య, మరో 20 మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది డి.అంబేద్కర్ వాదనలు వినిపిస్తూ.. ఎల్లంపల్లిప్రాజెక్టు పరిహారాన్ని ప్రభుత్వం రూ.58 కోట్లు విడుదల చేస్తూ 2011లో జీవో జారీ చేసిందన్నారు.
తర్వాత 2023లో తీసుకువచ్చిన జీవో 320 కింద పరిహారం చెల్లిస్తామనడం చట్టవిరుద్ధమన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రతివాదులైన నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి, ఈఎన్‌సీ, శ్రీపాదసాగర్ ప్రాజెక్టు డైరెక్టర్, జగిత్యాల కలెక్టర్‌కు నోటీసులు జారీ చేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.
