ఏడేండ్లు కనిపించకపోతే మృతి చెందినట్టే.. కారుణ్య నియామకంపై హైకోర్టు కీలక తీర్పు..

ఏడేండ్లు కనిపించకపోతే మృతి చెందినట్టే.. కారుణ్య నియామకంపై హైకోర్టు కీలక తీర్పు..
  • కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వండి: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఓ వ్యక్తి ఏడేండ్లు కనిపించకుంటే సదరు వ్యక్తి మరణించినట్టేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనల్లోని బాధితులకు కారుణ్య నియామకాలు చేయాల్సిందేనని తీర్పు చెప్పింది. ఈ మేరకు ఇండియన్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌కు ఉత్తర్వులు జారీ చేసింది. బాధితురాలి వినతిపత్రాన్ని పట్టించుకోని బ్యాంకుకు రూ.50 వేలు జరిమానా విధించింది. ఈమొత్తాన్ని సైనిక్‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌కు చెల్లించాలని ఆదేశించింది. తన వినతిపత్రాన్ని ఖాతరు చేయలేదంటూ ఖమ్మంకు చెందిన వి. సుగుణకుమారి దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ నగేశ్ భీమపాక విచారించారు. 

పిటిషనర్‌‌‌‌ భర్త వి. ప్రాన్సిస్1991లో ఇండియన్‌‌‌‌ బ్యాంకులో చేరారని, 2004లో అసిస్టెంట్‌‌‌‌ మేనేజరుగా ప్రమోషన్‌‌‌‌ వస్తే ఢిల్లీ వెళ్లిన ఏడు నెలలకు కనిపించకుండా పోయారని న్యాయవాది చెప్పారు. ఢిల్లీ పోలీసు స్టేషన్​లో 2008లో కేసు నమోదు అయ్యిందని పేర్కొన్నారు. అతడి ఆచూకీ దొరకలేదని పోలీసులు నివేదిక ఇచ్చారని, దీంతో బ్యాంకు పదవీ విరమణ ప్రయోజనాలతోపాటు కారుణ్య నియామకం కింద పిల్లల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని పిటిషనర్‌‌‌‌ వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేదన్నారు. పిటిషనర్‌‌‌‌ క్యాన్సర్‌‌‌‌తో బాధపడుతున్నారని, కుటుంబాన్ని ఆదుకోవాల్సి ఉందన్నారు. పిటిషనర్‌‌‌‌ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.