- పోలీసుల అనుచిత చర్యలపై రిపోర్ట్ ఇవ్వాలని డీజీపీకి ఆదేశం
- అసెంబ్లీ ఆవరణలో అయితే స్పీకర్‌కు..
- గేటు వద్ద అయితే కోర్టుకు నివేదించాలని స్పష్టీకరణ
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించి నివేదిక ఇవ్వాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ పరిధిలో జరిగితే స్పీకర్‌కు, గేటు వద్ద జరిగినట్లయితే కోర్టుకు నివేదిక సమర్పించాలని సూచించింది. అసెంబ్లీ బయట తమను అడ్డుకోవడంతోపాటు మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ బీఆర్‌ఎస్ ఎల్పీ తరఫున తలసాని శ్రీనివాసయాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి.మాధవీదేవి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ నల్లచొక్కాలతో వస్తున్న ఎమ్మెల్యేలను స్పీకర్ ఆదేశాల మేరకు మార్షల్స్, పోలీసులు అడ్డుకున్నారన్నారు. మహిళా ఎమ్మెల్యేలను లోపలికి అనుమతించగా, వారితోపాటు మిగిలినవారూ వెళ్లడానికి ప్రయత్నించడంతో తోపులాట జరిగిందని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులను దూషించడంతోపాటు దాడి చేశారని తెలిపారు.
పైగా ఈ పిటిషన్ వేసే అర్హత పార్టీ నేతలకు లేదన్నారు. బీఆర్‌ఎస్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత అసెంబ్లీ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో కేవలం పోలీసు కమిషనర్ జారీ చేసిన నిషేధాజ్ఞలు, స్పీకర్ జారీ చేసిన బులిటెన్ మాత్రమే ఉందని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి అసెంబ్లీ ప్రాంగణంలో జరిగే సంఘటనలపై చర్యలు తీసుకునే పూర్తి అధికారం స్పీకర్‌కే ఉందని స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పాక్షికంగా సవరిస్తూ పార్టీ దాఖలు చేసిన ఈ పిటిషన్ విచారణ అర్హత అంశాన్ని తుది విచారణలో తేలుస్తామని తెలిపారు.
