మానవీయ కోణంలో రష్యన్ మహిళ వీసా పొడిగించండి : హైకోర్టు

మానవీయ కోణంలో రష్యన్ మహిళ వీసా పొడిగించండి : హైకోర్టు
  • .ఇమ్మిగ్రేషన్ అధికారులకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: విదేశీ వితంతువుల వీసా పొడిగింపు విషయంలో నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ ప్రత్యేక పరిస్థితుల్లో మానవీయ కోణాన్ని విస్మరించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. భర్తను కోల్పోయి అసాధారణ పరిస్థితుల్లో ఉన్న ఒక రష్యన్ మహిళకు ఎలాంటి జరిమానా విధించకుండా వీసా పొడిగించాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను ఆదేశించింది. రష్యాకు చెందిన అలెనా ఎవజెనియేవ్నా పావ్‌‌లోవా 2018 నుంచి భారత్‌‌కు వచ్చి వెళ్తూ ఇక్కడి ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంటున్నారు. ఆమె జులై 2024లో భారతీయుడైన స్వరాగ్‌‌ను వివాహమాడారు. అయితే, అక్టోబరు 2025లో ఆయన అనారోగ్యంతో మృతి చెందారు.

భర్త కర్మకాండలు నిర్వహించడం, వృద్ధురాలైన అత్తకు తోడుగా ఉండడానికి ఆమె తన వీసా పొడిగింపు కోరగా అధికారులు తిరస్కరించారు. పిల్లలు లేని విదేశీ వితంతువులు దేశంలో ఉండటానికి నిబంధనలు అంగీకరించవని వాదించారు. దాంతో  ఆమె కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ నగేశ్ భీమాపాక కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలు లేని విదేశీ వితంతువుల విషయంలో మార్గదర్శకాలు కఠినంగా ఉన్న మాట వాస్తవమే అయినా కొన్ని సందర్భాల్లో విచక్షణాధికారాన్ని ఉపయోగించి మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. పిటిషనర్ ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నందున ప్రయాణం చేయడం కష్టమని తెలిపారు.