
హైదరాబాద్, వెలుగు: కరీంనగర్ చైతన్యపురిలోని మహాశక్తి ఆలయాన్ని దేవాదాయశాఖ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ ఆ శాఖ సహాయ కమిషనర్ 2016లో ఇచ్చిన నోటీసును రద్దు చేస్తూ హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, దేవాదాయశాఖ చట్టం నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ ఆలయ నిర్మాణదారు, ధర్మకర్త బండి సంజయ్ కుమార్ పెట్టుకున్న వినతిపత్రంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. మహాశక్తి ఆలయాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ కరీంనగర్ దేవాదాయశాఖ సహాయ కమిషనర్ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ మహాశక్తి ఆలయం తరఫున ధర్మకర్త, కేంద్ర మంత్రి బండి సంజయ్ పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఇటీవల విచారించారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మహాశక్తి ఆలయాన్ని 2010లో నిర్మించి నిర్వహణ బాధ్యతలను హంపీ విద్యారణ్య పీఠం విద్యారణ్య భారతి స్వామీజీకి అప్పగించినట్టు తెలిపారు. దేవాదాయశాఖ చట్టంలోని సెక్షన్ 154 కింద మినహాయింపునివ్వాలని ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చినట్టు తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది మంగ్లీ లాల్ నాయక్ వాదనలు వినిపిస్తూ.. దేవాదాయ చట్టంలోని సెక్షన్ 1(3)(బి) కింద అది ప్రజలకు చెందిన ఆలయం అని పేర్కొన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి నోటీసు ఇచ్చి 9 ఏండ్లు కాలం గడిచినా సెక్షన్ 6 కింద ఆలయాల జాబితాను అధికారులు ప్రకటించలేదని, అందువల్ల నోటీసులు చెల్లవంటూ వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.