ఒవైసీ అక్రమ నిర్మాణాలు కనిపించలేదా?..కూల్చివేతలు పేద, మధ్యతరగతికే పరిమితమా: హైకోర్టు

ఒవైసీ అక్రమ నిర్మాణాలు కనిపించలేదా?..కూల్చివేతలు పేద, మధ్యతరగతికే పరిమితమా: హైకోర్టు
  • ఇంత వివక్ష ఎందుకు?
  • బాధ్యులైన అధికారులపై విచారించి నివేదిక ఇవ్వండి
  • స్టూడెంట్లకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో సర్దుబాటు చేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు:హైదరాబాద్‌‌ పరిధిలోని సల్కంచెరువులో ఒవైసీ విద్యాసంస్థ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులకు కనిపించలేదా అంటూ గురువారం హైకోర్టు నిలదీసింది. పేద, మధ్యతరగతి వారు చేపట్టిన నిర్మాణాలు, కోర్టు వివాదాల్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేసే హైడ్రాకు ఈ నిర్మాణాలు కనిపించలేదా అంటూ ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో ఇంత వివక్ష ఎందుకు చూపుతున్నారని ప్రశ్నించింది. 2005 నుంచి నిర్మాణాలు కొనసాగుతుండగా అధికారులెవరూ వాటికి సరైన అనుమతులున్నాయో లేదో కూడా కనీస పరిశీలనలు చేసి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది.

ఈ నిర్మాణాలకు బాధ్యులైన అందరు అధికారులు, చివరికి పదవీ విరమణ చేసినా విచారించి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీచేయాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాలను పట్టించుకోకుండా తప్పుచేసిన అధికారులందరినీ గుర్తించి నివేదిక సమర్పించాలంటూ రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఒవైసీ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైనా వెళ్లిపోవాలనుకుంటే వారికి సహకరించాలని ఒవైసీ యాజమాన్యానికి, అలాంటి విద్యార్థులకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీట్లు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది.

సల్కం చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఒవైసీ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ విజయ్‌‌గోపాల్‌‌ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌‌పై జస్టిస్‌‌ ఎన్‌‌.వి.శ్రవణ్‌‌కుమార్‌‌ గురువారం విచారణ చేపట్టారు. హెచ్‌‌ఎండీఏ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సల్కం చెరువు ప్రాంతాన్ని సందర్శించి సమగ్ర నివేదికను సమర్పించాలని లేక్‌‌ ప్రొటెక్షన్‌‌ కమిటీ చైర్మన్‌‌కు ఆదేశాలు జారీ చేశామని, నివేదిక అందిన తరువాత ఎఫ్‌‌టీఎల్, బఫర్‌‌జోన్‌‌ను నిర్ధారిస్తూ తుది నోటిఫికేషన్‌‌ జారీ చేస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి రెండు నెలల గడువు కావాలని కోరారు.

జీహెచ్‌‌ఎంసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సంయుక్త సర్వే నిమిత్తం రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులను కేటాయించాలని కలెక్టర్‌‌కు లేఖ రాశామని తెలిపారు. నివేదిక అందిన వెంటనే లేక్‌‌ప్రొటెక్షన్‌‌ కమిటీ చైర్మన్‌‌కు అందజేస్తామన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి గత కొన్నేళ్లుగా నిర్మాణాలు జరుగుతుండగా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 2014 మ్యాప్‌‌ను పరిశీలిస్తే చెరువులో వివాదాస్పద నిర్మాణాలున్నట్లు తెలుస్తోందన్నారు. 2012 శాటిలైట్‌‌ మ్యాప్‌‌ను పరిశీలిస్తే గడ్డిమైదానాలు కనిపిస్తున్నాయని, చెరువు మధ్యలో భూమి కనిపిస్తోందన్నారు.

2014 నుంచి ప్రారంభమైన అక్రమ నిర్మాణాలు 2026నాటికి మొత్తం చెరువును మింగేశాయని పేర్కొన్నారు. ఏప్రిల్‌‌ 13న ఈ కోర్టు జారీ చేసిన ఆదేశాలతో అధికారుల్లో కదలిక ఏర్పడి చర్యలు ప్రారంభించారన్నారు. ప్రస్తుత వాదనల్లో కూడా ఒవైసీ కాలేజీలకు అనుమతులున్నాయో లేదో కూడా ఏ ప్రభుత్వ న్యాయవాదీ చెప్పడంలేదన్నారు. చెరువుల్లో ఇన్నేళ్లుగా ఇలాంటి నిర్మాణాలు కొనసాగుతున్నా చర్యలు తీసుకోకుండా తప్పుచేసిన అధికారులను గుర్తించి జులై 3లోగా నివేదిక సమర్పించాలని నీటిపారుదల, పురపాలక, విద్యాశాఖ, రెవెన్యూశాఖల ముఖ్యకార్యదర్శులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.