- ఫీజు రీయింబర్స్మెంట్పై ప్రైవేటు కాలేజీలకు ఊరట
- జీవో-9లోని నాలుగు నిబంధనలపై హైకోర్టు మధ్యంతర స్టే
- ఈ నెల 30 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టత
- అదే రోజు అన్ని పక్షాల వాదనలు విని తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
- బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలన్న ధర్మాసనం
- ఆగస్టు 15లోగా కొంత మొత్తం చెల్లిస్తామని ప్రభుత్వం హామీ
హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు వృత్తివిద్యా కాలేజీలకు తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫీజుల వసూలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన జీవో నంబర్ 9లోని నాలుగు కీలక నిబంధనల అమలుపై హైకోర్టు మధ్యంతర సస్పెన్షన్ విధించింది. ఈ ఉత్తర్వులు ఈ నెల 30వ తేదీ మంగళవారం వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గురువారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుపై ఎలాంటి చర్యలు తీసుకుంది? బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారు? చెప్పాలని ప్రశ్నించింది.
ఏజీ అన్ని అంశాలపై స్పష్టత ఇస్తారు..
ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదిస్తూ, జీవోలో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 15 నాటికి కొంత మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. అడ్మిషన్లు పూర్తై దరఖాస్తుల ప్రక్రియ ముగిసే సమయానికి ఆగస్టు 1 వస్తుందని, ఆ తర్వాత 15 రోజుల్లోగా ఫీజుల విడుదల జరుగుతుందని జీవోలో స్పష్టంగా పేర్కొన్నట్లు వివరించారు. ఈ వ్యవహారంపై అడ్వకేట్ జనరల్ పూర్తి వివరణ ఇస్తారని కోర్టుకు తెలిపారు. దీనిపై పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్యం శ్రీరామ్, న్యాయవాది తరణ్ జీ రెడ్డి వాదనలు వినిపిస్తూ, అప్పటి వరకు జీవో-9లోని అభ్యంతరకర నిబంధనలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పేరా 5.2(ఈ), 10.2, 10.4, 12.1(ఏ) అమలుపై సస్పెన్షన్ విధించాలని కోరగా, ధర్మాసనం అందుకు అంగీకరించి మంగళవారం వరకు మధ్యంతర సస్పెన్షన్ మంజూరు చేసింది. ప్రభుత్వం ఆగస్టు 15లోపు బకాయిలన్నీ చెల్లిస్తే పిటిషన్ల ఉపసంహరణపై ఆలోచిస్తామని తెలిపారు.
జీవో 7ను కూడా సవాల్ చేసిన కాలేజీలు
రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 29న జారీ చేసిన జీవో నంబర్ 7లోని ఒక క్లాజ్‌ను కూడా పలు ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు సవాల్ చేశాయి. విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవచ్చని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు ఆ క్లాజ్ విరుద్ధంగా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నాయి. జీవో 7 ప్రకారం ఫీజుల కోసం విద్యార్థులపై కళాశాలలు ఒత్తిడి చేయరాదని ప్రభుత్వం పేర్కొంది.
ప్రభుత్వం, కాలేజీల మధ్య నష్టపోతున్నాం: స్టూడెంట్స్
ఈ కేసులో పలువురు విద్యార్థులు కూడా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వం, కాలేజీల మధ్య తాము నష్టపోతున్నామని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వారి తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. రెండు, మూడు, నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులపై ఫీజులు చెల్లించాలని కళాశాలలు ఒత్తిడి చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తుందనే నమ్మకంతో వారు కాలేజీల్లో చేరారని, ఇప్పుడు ఫీజుల కోసం ఒత్తిడి చేయడం అన్యాయమన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, మంగళవారం అన్ని పక్షాల వాదనలు విని తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంటూ, అప్పటి వరకు జీవో 9లోని నాలుగు నిబంధనల అమలుపై మధ్యంతర సస్పెన్షన్ విధించారు.
