- అవసరమైతే హైడ్రా కమిషనర్, అధికారులను బ్యారక్స్‌కు తరలిస్తామని హెచ్చరిక
- ఏజీ హామీతో ఉత్తర్వుల జారీ నిలిపివేత
హైదరాబాద్, వెలుగు: కోర్టు ఉత్తర్వులను అమలు చేయడం లేదని గురువారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట గ్రామంలోని వివాదాస్పద భూమికి సంబంధించి హైడ్రాపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ప్రభుత్వ యంత్రాంగం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు ఉత్తర్వుల అమలుకు సైన్యాన్ని మోహరించేందుకు ఆదేశాలు జారీ చేశారు.
హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బైసన్ డివిజన్‌లోని సీనియర్ బ్రిగేడియర్‌ను సంప్రదించి పది మంది సైనికుల జాబితా సమర్పించాలని, ఆ సిబ్బందిని వివాదాస్పద స్థలంలో మోహరించి రక్షణ కల్పించాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ హైడ్రా అధికారులు లేదా మరెవరైనా ఆ స్థలంలోకి ప్రవేశిస్తే వారిని అదుపులోకి తీసుకుని ఆర్మీ బ్యారక్స్‌కు తరలించాలని, వారి వాహనాలను స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు.
విచారణ సందర్భంగా న్యాయమూర్తి ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సైన్యాన్ని రంగంలోకి దించడం కోర్టుకు ఇష్టం లేకపోయినా, న్యాయపాలన పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. రెండు రోజుల క్రితమే అడ్వకేట్ జనరల్ ఇచ్చిన హామీకి విరుద్ధంగా కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఒకే వివాదంపై వరుసగా మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలవడం తీవ్రమైన విషయమన్నారు.
ఇలాంటి పరిస్థితి తలెత్తితే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌తో పాటు సంబంధిత అధికారులను కూడా సైన్యం అదుపులోకి తీసుకుని బ్యారక్స్‌కు తరలించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో సెక్రటేరియెట్‌లో కూర్చున్నవారికి తెలియాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
ఏజీ హామీతో ఆదేశాల నిలుపుదల
లోతుకుంట సర్వే నంబర్లు 1, 2లోని 40 ఎకరాల భూమిలో ఈ నెల 17న హైడ్రా చేపట్టిన కూల్చివేతలను సవాల్ చేస్తూ శాంతా శ్రీరాం కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. గత విచారణలో పిటిషనర్ భూమిలోకి వెళ్లబోమని హైడ్రా హామీ ఇచ్చినప్పటికీ, అనంతరం అధికారులు మళ్లీ అక్కడికి వెళ్లి పునరుద్ధరణ పనుల్లో జోక్యం చేసుకున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది హరీశ్‌కుమార్ కోర్టుకు తెలిపారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను సమర్పించారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి ఫొటోల్లో హైడ్రా వాహనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, తేదీ, సమయం కూడా నమోదైందని పేర్కొన్నారు. ఇది కోర్టు ఉత్తర్వుల ప్రత్యక్ష ఉల్లంఘనేనని అన్నారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయడం రాజ్యాంగబద్ధ బాధ్యత అని స్పష్టం చేశారు. డివిజన్ బెంచ్ ఉత్తర్వులు అమల్లో ఉండగా ప్రైవేటు భూమిలోకి ఎలా ప్రవేశించారని ప్రశ్నించారు.
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ తొలుత హైడ్రా అధికారులు ఆ స్థలంలోకి వెళ్లలేదని వాదించారు. పిటిషనర్ సమర్పించిన ఫొటోలను పరిశీలించిన న్యాయమూర్తి ఆ వాదనను అంగీకరించలేదు. అనంతరం అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి స్వయంగా కోర్టు ఎదుట హాజరై పిటిషనర్‌కు చెందిన భూమిలోకి ఇకపై హైడ్రా అధికారులు వెళ్లబోరని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని శుక్రవారం అఫిడవిట్ రూపంలో సమర్పిస్తామని తెలిపారు. ఆ హామీని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, బెంచ్‌పై ప్రకటించిన ఆదేశాల జారీని నిలిపివేస్తూ ముందుగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు. కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
ఆర్మీ భూములను కాపాడండి ..హైడ్రాకు రక్షణ శాఖ అధికారుల వినతి
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆర్మీకి చెందిన స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, ఆ భూమిని కాపాడాలని రక్షణ శాఖ ఉన్నతాధికారులు హైడ్రాను ఆశ్రయించారు. ఈ మేరకు గురువారం హైడ్రా ఆఫీసులో కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను ఆర్మీ లెఫ్ట్‌నెంట్ కల్నల్ జై సింగ్ కలిసి వినతిపత్రం అందజేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని జీఎల్ఆర్ సర్వే నంబరు 507లో ఆర్మీకి చెందిన 'ఏ-1' భూమి ఉందని, అందులో ఆక్రమణలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆర్మీ స్థలాన్ని ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా 'జీ ప్లస్ 2' భవనాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. వెంటనే ఆ అక్రమ నిర్మాణాలను నిలిపివేసి, రక్షణ శాఖ స్థలాన్ని కాపాడాలని కోరారు.
