హైదరాబాద్, వెలుగు: హౌసింగ్ బోర్డుకు రావాల్సిన అద్దె బకాయిల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోని నాంపల్లితోపాటు వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హౌసింగ్ బోర్డు కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి. వీటిలో వివిధ ప్రభుత్వ శాఖలు ఎన్నో ఏండ్లుగా అద్దెకు ఉంటున్నాయి. నెలనెలా మాత్రం హౌసింగ్ బోర్డుకు అద్దె చెల్లించడం లేదు.
ఈ బకాయిలు మొత్తం రూ.145 కోట్లకు చేరాయని బోర్డు అధికారులు చెబుతున్నారు. ఈ బకాయిలు చెల్లించాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు లేఖలు రాసినా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ వస్తున్న శాఖలు కూడా అద్దెలు చెల్లించకపోవడం గమనార్హం.
టాప్ లో కమర్షియల్ డిపార్ట్ మెంట్..
రాష్ర్ట ప్రభుత్వానికి అత్యధికంగా రెవెన్యూ తెస్తున్న కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ, ఎక్సైజ్ వంటి కీలక శాఖలు కూడా హౌసింగ్ బోర్డు బిల్డింగ్స్ను ఉపయోగించుకుంటూ అద్దెలు చెల్లించడం లేదు. కమర్షియల్ ట్యాక్స్ నుంచే సుమారు రూ.25 కోట్లు అద్దె రావాల్సి ఉంది. తర్వాత రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలు ఉన్నాయి. వీటి వసూలు కోసం బోర్డు అధికారులు ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. ఇక కోర్టులు, ఆర్టీఐ ఆఫీసులు మాత్రం సకాలంలో బకాయిలు చెల్లిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ శాఖలకు హౌసింగ్ బోర్డు బిల్డింగ్స్..
హైదరాబాద్ లో ప్రభుత్వ శాఖల భవనాలు ప్రైవేట్ బిల్డింగ్స్ లో కొనసాగుతున్నాయి. వీటికి ఏటా కోట్లలో అద్దె చెల్లిస్తున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఆయా శాఖలు కొనసాగాలని సర్కారు నిర్ణయం తీసుకుంది.
