- ఇకపై ‘జస్ట్ ఇన్ టైమ్’ పద్ధతిలో నిధుల విడుదల
- అమల్లోకి 'సింగిల్ నోడల్ అకౌంట్–స్పర్శ్' విధానం
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ పథకం కూలీలు పైసల కోసం ఇకపై నెలల తరబడి ఎదురుచూడాల్సిన పనిలేదు. పనిచేసిన తర్వాత ఇన్టైంలో డబ్బులు నేరుగా వారీ ఖాతాలో పడనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘జస్ట్ ఇన్ టైమ్’ పద్ధతిలో నిధుల విడుదలకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసింది. ఇప్పటి వరకు ఉపాధి హామీ నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చి అక్కడి నుంచి జిల్లాకు తర్వాత కూలీల ఖాతాల్లోకి పడేవి. దీనికి చాలా సమయం పట్టేది. ఒక్కోసారి ఉపాధి నిధులు వేరే అవసరాలకు కూడా వినియోగించినట్లు ఆరోపణలొచ్చాయి.
వీటన్నింటికీ చెక్ పెడుతూ కేంద్రం ‘ఎస్ఎన్ఏ (సింగిల్ నోడల్ అకౌంట్)– స్పర్శ్’ అనే కొత్త మోడల్ అమల్లోకి తీసుకొచ్చింది. దీనిద్వారా ఖాతాలో ఎంత డబ్బు ఉంది.? ఎంత ఖర్చు అయ్యింది? అనేది కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పర్యవేక్షించనున్నది. అంతేకాకుండా, ఈ కొత్త విధానంలో ఉపాధి హామీ సాఫ్ట్‌వేర్, కేంద్రం పీఎఫ్ఎంఎస్ (పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్), రాష్ట్ర ఖజానా, రిజర్వ్ బ్యాంక్ (ఈ-కుబేర్) వంటి నాలుగు ఆన్‌లైన్ వ్యవస్థలు లింక్ అవుతాయి. గ్రామంలో పని పూర్తయిన వెంటనే అధికారులు బిల్లులు అప్‌లోడ్ చేస్తే కేంద్రం, రాష్ట్ర వాటాలు ఆటోమేటిక్‌గా రిలీజ్ అయి నేరుగా కూలీల అకౌంట్లలో జమ అవుతాయి. ఇలా డబ్బులు పక్కదారి పట్టే అవకాశం లేదు.
మళ్లించడానికి వీల్లేదు
కొత్త విధానంతో ఉపాధి హామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పీడీ అకౌంట్లలోకి గానీ, ఇతర అవసరాలకు గానీ మళ్లించడానికి వీలుండదు. బిల్లులు పాస్ అయిన వెంటనే ఆర్బీఐ ఈ-కుబేర్ ద్వారా నేరుగా కూలీల ఖాతాల్లో నిధులు జమకానున్నాయి. డిస్ట్రిక్ట్ లెవల్లో డీడీవోలు, అధికారులు బిల్లులు వచ్చిన 2 రోజుల్లోగా ఎఫ్‌టీవోలు (ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్) జనరేట్ చేయాలి. ఏవైనా తప్పులుంటే 3 రోజుల్లో సరిదిద్దాలి. లేకపోతే ఆ బిల్లులు రద్దవుతాయి. మెటీరియల్ కాంపోనెంట్లో కేంద్రం వాటా, రాష్ట్ర వాటా ఉంటుంది.
ఈ నిధులు కూడా సింగిల్ నోడల్ అకౌంట్(ఎస్ఎన్ఏ) ద్వారానే కంట్రోల్ అవుతాయి. ఈ కొత్త విధానంలో డీఆర్డీవోలను జిల్లా నోడల్ ఆఫీసర్లుగా, కమిషనరల్ రూరల్ డెవలప్మెంట్ను స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. ఎఫ్‌టీవోల జనరేషన్, ఐఎఫ్ఎంఐఎస్లో అప్‌లోడ్ చేయడం, ఆర్బీఐ ద్వారా చెల్లింపులు జరిగేలా చూడటం వీరి బాధ్యతే.
రోజూ మధ్యాహ్నం 3 గంటలకల్లా ఎఫ్‌టీవోలను అప్‌లోడ్ చేయాలని జీవోలో స్పష్టం చేశారు. ఈ కొత్త విధానాన్ని వెంటనే అమలు చేయాలని పీఆర్, ఆర్డీ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు, డీఆర్డీవోలు ఎప్పటికప్పుడు బిల్లులు అప్ లోడ్ చేయాలని, ఆలస్యం చేయవద్దని సూచించారు.
