- అంతర్జాతీయ స్థాయికి వికారాబాద్, యాదగిరిగుట్ట, బుద్ధవనం
- రూ.500 కోట్లతో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు
- ఎంపిక చేసిన ఒక కేంద్రంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు
- నిర్వహణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసింది. కేంద్ర ప్రభుత్వ 'డెవలప్‌మెంట్ ఆఫ్ ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ టు గ్లోబల్ స్కేల్' ప్రాజెక్టులో భాగంగా.. రాష్ట్రంలోని మూడు కీలక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నిధులను సమీకరించి సుమారు రూ.500 కోట్ల అంచనా వ్యయంతో ఒక కేంద్రాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని భావిస్తోంది.
ఇందుకోసం ప్రకృతి రమణీయతకు నిలయమైన వికారాబాద్, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన యాదగిరిగుట్ట, బౌద్ధ వారసత్వ సంపద కలిగిన నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని ప్రభుత్వం షార్ట్‌లిస్ట్ చేసింది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు.
సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్లాన్
ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర పర్యాటకశాఖ ప్రధానంగా మూడు ప్రాంతాలను షార్ట్ లిస్ట్ చేసింది. పర్యావరణ పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న వికారాబాద్, ఆధ్యాత్మిక వైభవానికి నిలయమైన యాదగిరిగుట్ట, బౌద్ధ వారసత్వ సంపద కలిగిన నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో ఒకదానిని ఎంపిక చేసి.. అక్కడ సకల సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎకో టూరిజం హబ్ గా వికారాబాద్‌కు పేరుంది.
ఇక్కడ అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, ట్రెక్కింగ్, బోటింగ్ పాయింట్లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. యాదగిరిగుట్టలో పునర్నిర్మించిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఇప్పటికే ఆధ్యాత్మిక పర్యాటకంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇక్కడ మౌలిక సదుపాయాలు పెంచడం ద్వారా విదేశీ భక్తులను సైతం ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. నాగార్జునసాగర్ లో 274 ఎకరాల్లో బుద్ధవనం విస్తరించి ఉంది. ఈ బౌద్ధ థీమ్ పార్క్ ఆసియాలోనే అతి పెద్దది. ఆగ్నేయ ఆసియా దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఇది కేంద్ర బిందువుగా మారనున్నది.
అత్యున్న ప్రమాణాలపై దృష్టి
మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా, ఆ పర్యాటక కేంద్రం నిరంతరం అత్యున్నత ప్రమాణాలతో కొనసాగేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఇందుకోసం ప్రయోగత్మకంగా ప్రత్యేక 'డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఎంఓ)'ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ సంస్థ పర్యాటక కేంద్రంలోని పరిపాలన, సందర్శకులకు ఏర్పాట్లు, భద్రత, పారిశుధ్యం నిర్వహణతోపాటు అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తోంది.
ఈ ప్రయోగం సక్సెస్అయితే.. రాష్ట్రంలోని ఇతర పర్యాటక ప్రాంతాలకూ దీనిని విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది. కాగా, ఒక ప్రాంతాన్ని 'ఐకానిక్ టూరిస్ట్ సెంటర్' గా గుర్తించి అభివృద్ధి చేయడం వల్ల ఆ ప్రాంతానికి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ హోదా దక్కడం వల్ల ఆ పర్యాటక ప్రాంతం పేరు అంతర్జాతీయ పర్యాటక మ్యాప్‌లో చేరనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రావెల్ ఏజెన్సీలు, వెబ్‌సైట్లు ఈ ప్రాంతాన్ని విదేశీ పర్యాటకులకు సిఫార్సు చేస్తాయి. దీనివల్ల తెలంగాణకు అంతర్జాతీయంగా బ్రాండ్ ఇమేజ్ వస్తుంది.
