
- మరో మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం
- వర్షాల నేపథ్యంలో సర్కార్ ముందస్తు చర్యలు
హైదరాబాద్, వెలుగు: వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. 12 స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్ఎఫ్) టీమ్స్‌ను సిద్ధంగా ఉంచింది. ఒక్కో టీమ్‌లో స్టేట్ స్పెషల్ పోలీస్ విభాగానికి చెందిన 100 మంది ఉన్నారు. ఈ బృందాలను రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అందుబాటులో ఉంచామని డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం బుధవారం ప్రకటనలో పేర్కొంది. ఎక్కడైనా భారీ వర్షాలు వస్తే సమీపంలోని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే అక్కడికి చేరుకుంటాయని తెలిపింది.
ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్‌తో పాటు ఈసారి మూడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్) బృందాలను హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. ఈ నెలాఖరులోగా రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, దీంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో ఎలాంటి విపత్తులు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ముంపు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సూచించింది.
జిల్లాలకు కేటాయించిన ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో టచ్‌లో ఉండాలని చెప్పింది. కలెక్టర్లు తమ జిల్లా పరిధిలోని ఫైర్ ఆఫీసర్లను సంప్రదించి స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ సేవలు పొందాలని సూచించింది. ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ గైడ్‌లైన్స్ విడుదల చేశారు. పోయినేడాది ఆగస్టులో భారీ వర్షాలు వచ్చినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సకాలంలో స్పాట్‌కు చేరుకోకపోవడంతో నష్టం జరిగిందని, అందుకే ఈసారి ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని అన్ని ఫైర్ స్టేషన్లలో సిబ్బందికి ప్రత్యేకంగా విపత్తుల నివారణ చర్యలపై శిక్షణ ఇప్పించామని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు హైడ్రా బృందాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.