రెండు రోజులు అకావాల వర్షాల కారణంగా ఎండకు కాస్త బ్రేక్ ఇచ్చిందో లేదో.. మళ్లీ తెలంగాణ భగ్గున మండుతోంది. వాతావరణం చల్లబడింది అనుకుంటే అంతలోనే మళ్లీ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో మండుతున్న ఎండలకు జనాలు విలవిలలాడుతున్నారు.
రాష్ట్రంలో శుక్రవారం (మే 29) కూడా టెంపరేచర్లు రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. 3 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా, 7 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాంలో 46.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 46.2, పెద్దపల్లి జిల్లా 8 ఇంక్లైన్లో 46.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్‌లో 45.6, జగిత్యాల జిల్లా నేరెళ్ల, సూర్యాపేట జిల్లా మునగాలలో 45.4, ఖమ్మం జిల్లా పల్లెగూడెం, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, ములుగు జిల్లా లక్ష్మీదేవిపేట, వరంగల్ జిల్లా కాపులకనపర్తిలలో 45.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆరు జిల్లాల్లో 44 డిగ్రీలు, నాలుగు జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా రికార్డయ్యాయి. హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్, గోషామహల్, ముషీరాబాద్ సర్కిళ్లలో అత్యధికంగా 42.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. హయత్‌నగర్‌లో 42.1, బేగంపేటలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
