- బతుకమ్మ లేని తెలంగాణ తల్లి.. తెలంగాణ తల్లే కాదు
- రాష్ట్రంలో మేమే ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్, బీజేపీ ఫెయిల్
- ట్యాంక్‌బండ్‌తో పాటు అసెంబ్లీలోనూ ఫూలే విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పించలేదని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనైనా కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు అఖిలపక్షాన్ని ప్రభుత్వం ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న బీసీ బిల్లులకు ఆమోదం లభించేలా ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి చేయాలన్నారు.
శుక్రవారం ఆమె ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేస్తున్న మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు బడ్జెట్లో ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. గత రెండు బడ్జెట్లలో బీసీలకు తక్కువ కేటాయింపులు చేశారని, అందులోనూ 30 శాతం కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.
బతుకమ్మ లేని తెలంగాణ తల్లి విగ్రహం.. తెలంగాణ తల్లే కాదని, ప్రభుత్వం పెట్టే కాంగ్రెస్ తల్లి బొమ్మకు ప్రజల ఆమోదం ఉండదన్నారు. బలవంతంగా ఒక ప్రతీకను ప్రజల మీద రుద్దే ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరని, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
అగ్రకులాలకే కార్పొరేషన్ పదవులు
కార్పొరేషన్ల పదవులు కూడా అగ్రకులాల వారికే ఇస్తున్నారని, బీసీ, మహిళ, మైనారిటీలకూ కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఆర్. కృష్ణయ్య, జాగృతి లాంటి సంస్థల పోరాటం ఫలితంగా బీసీల్లో చైతన్యం పెరిగిందని, మొన్న జరిగిన ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ స్థానాలు దక్కేందుకు ఆ చైతన్యమే కారణమని చెప్పారు. రాజకీయ రిజర్వేషన్లకు అడ్డంకులు ఉన్నాయే తప్ప బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు ఎలాంటి అడ్డంకులు లేవని, ఆ రిజర్వేషన్లనైనా అమలు చేయాలని కోరారు.
రాష్ట్రంలో తామే ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నామని చెప్పారు. చాలా చోట్ల ప్రజలు ఏ పార్టీకీ మెజారిటీ ఇవ్వలేదని, అన్ని పార్టీలనూ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. హంగ్ వచ్చిన చోట కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ ఫెయిల్ అయ్యాయి కాబట్టే.. కాంగ్రెస్‌కు అన్ని సీట్లు వచ్చాయన్నారు.
ఫూలే విగ్రహ ఏర్పాటు మా పోరాటం వల్లే
ఫూలే విగ్రహ ఏర్పాటుకు జాగృతి తరఫున రెండేండ్లుగా పోరాడుతున్నామని, తమ పోరాటంతోనే ప్రభుత్వం దిగివచ్చి ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నదని కవిత చెప్పారు. ఒక్క ట్యాంక్‌బండ్‌పైనే కాకుండా.. అసెంబ్లీలో కూడా ఆయన విగ్రహాన్ని పెట్టాలన్నదే తమ డిమాండ్ అన్నారు. కాంగ్రెస్ ఆ పని చేయకుంటే.. జాగృతి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ పనిచేస్తామన్నారు.
కాగా.. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్థలం ఇస్తే జయశంకర్ సార్ విగ్రహ ఏర్పాటుతో పాటు నిర్వహణకు అయ్యే ఖర్చు జాగృతి భరిస్తుందన్నారు
