ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గే అవకాశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. పడే ప్రతి వాన చుక్కను భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘జల సంచాయ్–జన భాగీదారి’ నినాదంతో గ్రామాలు, పట్టణాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తూ వర్షపు నీటి సంరక్షణ ఉద్యమాన్ని విస్తృతంగా చేపట్టింది. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు, ప్రతి పొలంలో పంట కుంటలు, గ్రామాల్లో ఊట కుంటల ఏర్పాటుతో భవిష్యత్తు నీటి అవసరాలను తీర్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.
- ఇంటింటికీ ఇంకుడు గుంతలు.. పొలాల్లో పంట కుంటల ఏర్పాటుకు ప్రోత్సాహం
- ‘జల సంచాయ్ – జన భాగీదారి’ పేరుతో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలను పెంచి నీటి ఎద్దడిని తట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎల్-నినో ప్రభావంతో ఈసారి వర్షాలు ఆశించిన స్థాయిలో ఉండబోవని అధికారులు చెబుతున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో భూమిపై పడే ప్రతి వాన చుక్కను ఒడిసిపట్టేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోంది.
‘జల సంచాయ్ – జన భాగీదారి(నీటిని పొదుపు చేద్దాం.. జనమంతా భాగస్వామ్యం అవుదాం)’ అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. పట్టణాలు, గ్రామాల్లో కురిసిన వర్షపు నీరు వృథాగా డ్రైనేజీల్లోకి పోకుండా ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. వర్షపు నీటిని భూమిలోకి పంపడం ద్వారా భూగర్భ జలాలు రీచార్జ్ అవుతాయని, దీనివల్ల వేసవిలో కూడా బావులు, బోర్లు ఎండిపోకుండా ఉంటాయని అధికారులు వివరిస్తున్నారు.
పొలాల్లో పంట కుంటలు..
వ్యవసాయ భూముల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ‘ప్రతి పొలానికి పంట కుంట’ అనే విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పొలంలో ఒక మూలన కుంట తవ్వడం ద్వారా వర్షపు నీరు అక్కడ నిల్వ ఉంటుంది. ఇది భూమిలో తేమను కాపాడటమే కాకుండా, అత్యవసర సమయంలో పంటలకు ప్రాణవాయువులా మారుతుంది. గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాలు, వాలు ప్రాంతాల్లో ఊట కుంటలను నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. అడవి నుంచి లేదా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటిని అక్కడికక్కడే ఆపి, భూమిలోకి ఇంకేలా చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఊరు చుట్టూ నీటి నిల్వలు పెరిగితే గ్రామం పచ్చదనంతో కళకళలాడుతుందని ప్రభుత్వం చెబుతోంది. నీటి సంరక్షణ చర్యల వల్ల కలిగే ప్రయోజనాలను పోస్టర్ ద్వారా ప్రభుత్వం వివరిస్తోంది.
నీటి మట్టం పెరిగి బోర్లు, బావులు నిరంతరం పోస్తాయని.. చెట్లు పెరిగి, పంటలు సమృద్ధిగా పండుతాయని అవగాహన కల్పిస్తోంది. నీటి లభ్యత పెరిగితే పర్యావరణం బాగుంటుందని, మన ఆరోగ్యానికి, భవిష్యత్తుకు మేలు చేస్తుందని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క నేతృత్వంలో సాగుతున్న ఈ ‘జల సంరక్షణ’ ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆఫీసర్లు కోరుతున్నారు. ‘నీటి సంరక్షణే మన సంరక్షణ’ అని గుర్తు చేస్తూ.. రేపటి తరం కోసం నీటిని పొదుపు చేయాలన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
