- వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ప్రతీ ఇంటి ముందు ఇంకుడు గుంత నిర్మాణం
- మహిళా సంఘాల సభ్యుల భాగస్వామ్యంతో కార్యక్రమం
- ఊరూరా సర్వేలు చేస్తున్న ఆఫీసర్లు
- బీవీజీ రామ్ జీ స్కీం కింద వంద శాతం సబ్సిడీతో పనులు
మహబూబ్నగర్, వెలుగు : ఎల్ నినో ప్రభావంతో రాష్ర్టంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆగస్టు వస్తున్నా ఈసారి ఇంకా భారీ వర్షాలు నమోదు కాకపోవడంతో నదులకు వరదలు రావడం లేదు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు నీరు లేక వెలవెలబోతుండగా.. బోరు బావులు వేగంగా ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వర్షపు నీటిని ఒడిసి పట్టి, వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలను పెంచేందుకు కొత్తగా ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత.. ప్రతి పొలానికి ఒక పంట కుంట.. ప్రతీ ఊరికి ఒక ఊట కుంట’ అనే స్లోగన్‌తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
వంద శాతం సబ్సిడీతో వీబీ జీ రామ్ జీ స్కీం ద్వారా రాష్ర్టంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఏడు రకాల నీటి కుంటలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు నెలాఖరు వరకు వీబీ జీ రామ్ జీ ద్వారా ఈ కుంటల నిర్మాణాలు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లు ఎంపీడీవోలు, మండల ఆఫీసర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి నీటి కుంటలు అవసరమో ప్రతిపాదనలు రెడీ చేసి అందించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆఫీపర్లు గ్రామాల బాట పట్టారు. ఊరూరు తిరుగుతూ సర్వేలు చేస్తున్నారు. సూచనలతో ఆఫీసర్లు మహిళా సంఘాల సభ్యులనూఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నారు. వారి ద్వారా గ్రామాల్లో ఎవరెవరి ఇండ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించాల్సిన అసవరంతో ఉందో అడిగి తెలుసుకుంటున్నారు.
ఏడు రకాల నీటి కుంటలు..
ఎన్ నినో ప్రభావంతో చాలా గ్రామ పంచాయతీల్లో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. కొన్ని మండలాల్లో ఓవర్ ఎక్సైడ్గా గ్రౌండ్ వాటర్ పడిపోతోంది. దీంతో ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో జలసిరి కార్యక్రమం ద్వారా వీబీ జీ రామ్ జీ స్కీం కింద భూ గర్భ జలాలను పెంపొందించే ఏడు రకాల కుంటలను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతిఇంటి ముందు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. సింగిల్ ఫేజ్ మోటార్లు, తాగునీటి ట్యాంకుల వద్ద నీరు వేస్ట్‌గా పోనివ్వకుండా కమ్యూనిటీ ఇంకుడు గుంతలను నిర్మించనున్నారు. ఎండిపోయిన వ్యవసాయ బోరు బావులు వద్ద, గ్రామ పంచాయతీ బోర్లు, కమర్షియల్ బోర్ల వద్ద గ్రౌండ్ వాటర్‌ను పెంపొందించేందుకు బోర్ వెల్ రీచార్జ్ స్ర్టక్చర్స్ నిర్మించనున్నారు. ప్రతి మండలంలో 60 ఫీట్ల లోతు, 20 మీటర్ల వెడల్పుతో ఒక బోర్ వెల్‌ను నిర్మించనున్నారు. నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో బోర్ బావుల తవ్వకాలకు స్థలాలను గుర్తించాలని ఆఫీసర్లు ఆదేశాలు జారీ చేశారు. ఇవి కాకుండా వ్యవసాయ పొలాల్లో పర్కులేషన్ ట్యాంకులు, మూడు రకాల ఫామ్ పాండ్స్‌ను నిర్మించనున్నారు.
మ్యాజిక్ సోక్ పిట్స్ నిర్మాణాలు..
ఎల్ నినో ప్రభావంతో గ్రామ పంచాయతీల్లోని కాలనీల్లో మ్యాజిక్ సోక్ పిట్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద వీటి నిర్మాణాలను చేపట్టారు. గత నెల తెలంగాణలోనూ ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి, ఆ గ్రామంలో మ్యాజిక్ సోక్ పిట్స్ నిర్మించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ ఎల్ నినో కారణంగా తాజాగా తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మ్యాజిక్ సోక్ పిట్స్ నిర్మించాలని ఆదేశాలు అందాయి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో వీటి నిర్మాణాలకు ప్రియారిటీ ఇవ్వాలని ఉంది.
అయితే సిమెంట్ మోరీలు లేని ప్రాంతంలోనే వీటిని నిర్మించాల్సి ఉంది. ఒక్కో మ్యాజిక్ సోక్ పిట్డ్రైన్ను వంద మీటర్లకు ఒకటి చొప్పున కట్టనున్నారు. ఈ వంద మీటర్ల డ్రైన్‌కు 30వ మీటర్ వద్ద చిన్న సైజు ఇంకుడు గుంత, 60 మీటర్ల వద్ద మీడియం సైజ్ ఇంకుడు గుంతలు, వంద మీటర్ వద్ద పెద్ద ఇంకుడు గుంతలను నిర్మించనున్నారు. రెండున్నర ఫీట్ల వెడల్పు, రెండున్నర ఫీట్ల లోతుతో ఈ డ్రైన్‌ను నిర్మిస్తారు. రెండున్నర ఫీట్ల ఎత్తు ఉన్న బండలు పెడతారు. రెండున్నర ఫీట్ల లోతులో మీడియం సైజు కంకర, చిన్న సైజు కంకర పోసి నీరు భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోనున్నారు.
గ్రామ సభల ద్వారా అవగాహన..
జలసిరి కార్యక్రమం గురించి ప్రజలకు తెలిపేందుకు ఆఫీసర్లు గ్రామాల బాట పడుతున్నారు. ఈ సందర్భంగా అక్కడే గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఎల్ నినో ప్రభావం వల్ల ఏర్పడుతున్న పరిస్థితుల గురించి ప్రజలు, రైతులకు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలను పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పిస్తున్నారు. గ్రామ సభల్లో ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులతో పాటు వీబీ జీ రామ్ జీ పథకం సిబ్బంది ఈ సభల్లో పాల్గొంటున్నారు. మండల స్థాయి ఆఫీసర్లు కూడా సభలకు హాజరై ప్రజలకు జలసిరి గురించి వివరిస్తున్నారు.
