- 75.9% డిజిటల్ క్రాప్ సర్వే పూర్తి
- వ్యవసాయ మంత్రి తుమ్మల
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వానాకాలం సీజన్‌లో ఎరువుల పంపిణీ సాఫీగా, పారదర్శకంగా సాగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు కొరత రాకుండా ముందుగానే ఎరువులను రాష్ట్రానికి తెప్పించి నిల్వ చేశామని చెప్పారు. యాప్‌ల ద్వారా సరఫరా, విక్రయాలను పర్యవేక్షించడం వల్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట పడిందన్నారు. గత వానాకాలంతో పోలిస్తే ఈసారి యూరియా వినియోగం దాదాపు 35 వేల టన్నులు తగ్గిందని వెల్లడించారు.
రాష్ట్ర ఫెర్టిలైజర్ యాప్‌లో వానాకాలం సీజన్‌లో 33.39 లక్షల మంది రైతులు నమోదు చేసుకోగా, 142.08 లక్షల బస్తాలు బుక్ అయ్యాయి. ఇందులో 128.18 లక్షల బస్తాలను రైతులు కొనుగోలు చేశారు. ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా 37.48 లక్షల క్యూఆర్ కోడ్‌లు జనరేట్ కాగా, అన్ని రకాల ఎరువులు కలిపి 141.88 లక్షల బస్తాలు బుక్ అయ్యాయి. ఇప్పటివరకు 104.99 లక్షల బస్తాలను రైతులు కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు.
ప్రస్తుతం 2.33 లక్షల టన్నుల యూరియా నిల్వ ఉందని.. ఈనెలలో మరో 2 లక్షల టన్నుల యూరియాను రాష్ట్రానికి తెప్పించేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. వానాకాలం డిజిటల్ క్రాప్ సర్వేలో ఇప్పటివరకు 1.93 కోట్ల వ్యవసాయ క్షేత్రాలను సర్వేకు కేటాయించగా,1.46 కోట్ల క్షేత్రాల్లో (75.9 శాతం) సర్వే పూర్తయిందని తెలిపారు. భవిష్యత్‌లో పంటల కొనుగోళ్లు, యాంత్రీకరణ పథకాలు, సబ్సిడీ విత్తనాల పంపిణీ తదితర వ్యవసాయ పథకాలను డిజిటల్ క్రాప్ సర్వే ఆధారంగానే అమలు చేయనున్నట్లు మంత్రి చెప్పారు.
