- విలీనం, యూనియన్ల పునరుద్ధరణపై ఉత్కంఠ
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను ఆర్టీసీలోకి అనుమతించాలని, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీయే నిర్వహించాలనే డిమాండ్ తో కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసుపై కార్మిక శాఖ స్పందించింది. గురువారం సాయంత్రం 4 గంటలకు లేబర్ కమిషనర్ కార్యాలయంలో చర్చించేందుకు రావాల్సిందిగా ఇటు ఆర్టీసీ యాజమాన్యాన్ని, అటు సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాల నేతలను అధికారులు ఆహ్వానించారు.
ఈ చర్చలు సఫలమైతే కార్మికులు సంబరాలు చేసుకుంటారని, లేదంటే ఈ నెల 10 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. మార్చి 13 న ఆర్టీసీలోని పలు యూనియన్లు లేబర్ కమిషనర్ ను కలిసి సమ్మె నోటీసు ఇవ్వగా..దీనిపై స్పందించిన కార్మిక శాఖ అదే నెల 25 న చర్చలకు రావాల్సిందిగా ఆర్టీసీ యాజమాన్యానికి, యూనియన్ నేతలను పిలిచింది.
అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున తాము ఈ సమయంలో చర్చలకు రాలేమని, మరో తేదీని ఖరారు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం తరపున అధికారులు కార్మిక శాఖకు విజ్ఞప్తి చేశారు. దీంతో చర్చలు వాయిదా పడ్డాయి.అసెంబ్లీ సమావేశాలు ముగిసి వారం గడిచినా మళ్లీ చర్చలకు పిలవడం లేదని, దీంతో తాము ఈ నెల 10 న ‘‘ చలో లేబర్ ఆఫీసు ’’ కార్యక్రమాన్ని చేపడుతామని ఆర్టీసీ యూనియన్లు ప్రకటించాయి. దీంతో కార్మిక శాఖ ఈ నెల 9 న చర్చలకు రావాల్సిందిగా ఇరువర్గాలను క ఆహ్వానించింది. కాగా, గురువారం చర్చలపై ఆర్టీసీలో ఉత్కంఠ నెలకొంది.
