వాన నీటిని ఒడిసి పట్టేలా..! రూ.368 కోట్లతో 35 వాటర్‌‌‌‌షెడ్ ప్రాజెక్టులు

 వాన నీటిని ఒడిసి పట్టేలా..! రూ.368 కోట్లతో 35 వాటర్‌‌‌‌షెడ్ ప్రాజెక్టులు

 

  • 21 జిల్లాల్లో ముమ్మరంగా సాగుతున్న పనులు
  • ప్రధానమంత్రి కృషి సించాయ్ కింద నిధులు మంజూరు 
  • ఇందులో  కేంద్రం వాటా 60%.. రాష్ట్రం వాటా 40% 
  • జల సంరక్షణ, గ్రామీణ ఉపాధి, మౌలిక వసతులకు పెద్దపీట

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటి పోకుండా, వృథాగా పోతున్న వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. 'నీరే ప్రాణాధారం' అనే నినాదంతో రూ.368 కోట్లతో  35 సమీకృత వాటర్‌‌‌‌షెడ్ ప్రాజెక్టులను మంజూరు చేసింది.  మూడు నుంచి ఐదేండ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది.  రాష్ట్రంలోని 21 జిల్లాల పరిధిలో  దాదాపు 1,46,686 హెక్టార్ల విస్తీర్ణంలో వాటర్‌‌‌‌షెడ్ ప్రాజెక్టుల పనులు చేపడుతున్నారు. కేవలం నీటి నిల్వకే పరిమితం కాకుండా గ్రామీణ ఉపాధి, ఉత్పాదకతతో అనుసంధానించింది.

  కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యంతో పనులు చేపడుతుండగా.. ఇందులో కేంద్రం వాటా 60శాతం, రాష్ట్ర వాటా 40 శాతంగా ఉంది.  ప్రధాన మంత్రి కృషి సించాయ్​​ యోజనలో భాగంగా ప్రభుత్వం ఈ నిధులను ప్రధానంగా మూడు అంశాలకు కేటాయించింది.  మంజూరైన నిధుల్లో సింహభాగం జలవనరుల పరిరక్షణకే వినియోగించనున్నారు. స్థానికంగా పనులు కల్పించడం, మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు నిధులు కేటాయించనున్నారు. వ్యవసాయ దిగుబడులు పెంచేలా చర్యలు చేపట్టనున్నారు.  

నీరు వృథా పోకుండా.. 

భూగర్భ జలాలను రీఛార్జ్ చేసేందుకు వీలుగా ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టేలా క్షేత్రస్థాయిలో నిర్మాణాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వాగులపై చెక్​డ్యామ్​లు నిర్మించి నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించి, భూమిలోకి ఇంకేలా చేస్తున్నారు.  వ్యవసాయ కుంటలు (ఫామ్ పాండ్స్)  నిర్మిస్తున్నారు. రైతుల పొలాల్లోనే చిన్న కుంటలు నిర్మించి, వాన నీటిని నిల్వ చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు.  నీరు ఎక్కువగా నిల్వ ఉండే ప్రాంతాల్లో పెర్కులేషన్ ట్యాంకులను  నిర్మించి భూగర్భ జలాలను పెంచేలా ప్రణాళిక రూపొందించారు.  బోర్‌‌‌‌వెల్ రీఛార్జ్ లో భాగంగా ఎండిపోయిన బోర్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించి, వాటికి పునరుజ్జీవం పోస్తున్నారు. 

మహిళలకు ఆర్థిక చేయూత 

ఈ పథకం కేవలం జల సంరక్షణకే పరిమితం కాలేదు. గ్రామీణ మౌలిక వసతుల కల్పన, మహిళా సాధికారతకు కూడా పెద్దపీట వేస్తున్నది.  ఈ నిధులతో గ్రామాల్లో బస్సు షెల్టర్లు, కమ్యూనిటీ భవనాల వంటివి నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. అదే విధంగా మహిళా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రోత్సాహం అందిస్తున్నారు. కోళ్లు, మేకలు, గేదెల పెంపకం, పప్పు దినుసుల దుకాణాలు,  కుట్టు మిషన్ల కొనుగోలు వంటి చిన్న వ్యాపారాలు ప్రారంభించుకునేందుకు మహిళా సంఘాలకు రూ.20 వేల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నారు. ఎంపిక చేసిన 21 జిల్లాలోని  సంఘాలకు మాత్రమే ఈ నిధులను కేటాయించనున్నారు. ఈ వాటర్​ షెడ్​ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలోని గ్రామాల రూపురేఖలు మారుతాయని అధికారులు పేర్కొంటున్నారు.