డిజిటల్ పేమెంట్స్‌‌లో తెలంగాణ అదుర్స్.. యూపీఐ ట్రాన్సాక్షన్లలో 4.1% వాటాతో దేశంలో నాలుగో స్థానం

డిజిటల్ పేమెంట్స్‌‌లో తెలంగాణ అదుర్స్.. యూపీఐ ట్రాన్సాక్షన్లలో 4.1% వాటాతో దేశంలో నాలుగో స్థానం
  • జులైలో ఏకంగా రూ.1.26 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్‌‌.. 
  • నిత్యావసర కొనుగోళ్లలో కిరాణాదే షాపులదే అగ్రస్థానం 
  • డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో 
  • రాష్ట్రం కీలక పాత్ర

హైదరాబాద్, వెలుగు: డిజిటల్ పేమెంట్స్‌‌లో తెలంగాణ దుమ్ము రేపింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌‌ ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగిన లావాదేవీల్లో దేశంలోనే నాలుగో అతిపెద్ద వాటాదారుగా నిలిచింది. యూపీఐ లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌‌పీసీఐ) తొలిసారిగా రాష్ట్రాలవారీ డేటాను విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం..జులైలో ఒక్క తెలంగాణలోనే ఏకంగా రూ.1.26 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. 

ఇది దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం లావాదేవీల విలువలో సుమారు 5.8% వాటా కాగా.. లావాదేవీల సంఖ్య పరంగా చూస్తే, రాష్ట్రంలో 791 మిలియన్ల (సుమారు 79.1 కోట్లు) ట్రాన్సాక్షన్స్‌‌ నమోదయ్యాయి. ఇది మొత్తం సంఖ్యలో 4.1% వాటా. ఈ లెక్కలు చూస్తే.. దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తున్నదని అర్థమవుతున్నది. రాష్ట్రంలో డిజిటల్​ చెల్లింపులను జనం ఎంత వేగంగా 
స్వీకరిస్తున్నారో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.


డిజిటల్ చెల్లింపులు ఏ రంగాల్లో ఎక్కువగా జరుగుతున్నాయో కూడా నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా.. టాప్ 15 వ్యాపార రంగాలు కలిపి లావాదేవీల సంఖ్యలో 70%, విలువలో 47% వాటాను కలిగి ఉన్నాయి. వీటిలో కిరాణా సామాగ్రి  కొనుగోళ్లు అతిపెద్ద విభాగంగా ఉన్నాయి. ఇక్కడ లావాదేవీల సంఖ్య 24.3% ఉన్నా, మొత్తం విలువలో మాత్రం 8.8% మాత్రమే ఉంది. అంటే, చిన్న మొత్తంలో ఎక్కువసార్లు కిరాణా కొనుగోళ్లు జరుగుతున్నాయి.  అయితే, రుణాలు వసూలు చేసే ఏజెన్సీల విభాగంలో లావాదేవీల సంఖ్య 1.3% మాత్రమే ఉన్నా, విలువలో ఏకంగా 12.8% వాటా ఉంది. ఈ విభాగంలో సగటు లావాదేవీ విలువ ₹5,817గా ఉండటం గమనార్హం.

జాతీయస్థాయిలో ఇలా..

జాతీయస్థాయిలో యూపీఐ లావాదేవీల విలువలో 9.8% వాటాతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో కర్నాటక (5.5%), ఉత్తరప్రదేశ్ (5.3%) నిలిచాయి. ఆశ్చర్యకరంగా, టాప్ ఐదు రాష్ట్రాల్లో యూపీ ఒక్కటే ఉత్తరాది రాష్ట్రం. అంటే, యూపీఐ వినియోగం దేశమంతా విస్తరించిందని ఈ డేటా చెబుతున్నది. తెలంగాణ టాప్-5లో నిలిచి.. దేశ డిజిటల్ పేమెంట్స్ మ్యాప్‌‌‌‌లో పటిష్టమైన స్థానాన్ని దక్కించుకున్నది. వినియోగదారులు డిజిటల్ చెల్లింపులకు బాగా అలవాటు పడటం, డిజిటల్ ఎకానమీ బలోపేతం కావడం వల్లే ఈ వృద్ధి సాధ్యమైందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

యూపీఐ వృద్ధి వేగం అంచనాలకు మించి ఉంది. సగటు రోజువారీ లావాదేవీల విలువ జనవరి 2025లో రూ.75,743 కోట్లు ఉండగా, జులై నాటికి రూ.80,919 కోట్లకు, ఆగస్టు నాటికి ఏకంగా రూ. 90,446 కోట్లకు పెరిగింది. అలాగే, రోజువారీ లావాదేవీల సంఖ్య జనవరిలో 127 మిలియన్ల నుంచి ఆగస్టు నాటికి 675 మిలియన్లకు పెరిగింది. అంటే, డిజిటల్ చెల్లింపులు మన రోజువారీ జీవితంలో ఎంతగా కీలకంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. 

ఇదే కాకుండా ఇటీవల ప్రముఖ ఫిన్‌‌‌‌టెక్ సంస్థ ఫోన్‌‌‌‌పే, అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ బీసీజీ (బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్) సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. డిజిటల్ లావాదేవీలలో తెలంగాణ ముందున్నది. రాష్ట్రంలో ప్రతి  పౌరుడికి (15–-65 ఏండ్లు) నెలకు జరుగుతున్న డిజిటల్ లావాదేవీల సంఖ్య (వాల్యూమ్ పెనెట్రేషన్) అధికంగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.  తెలంగాణలో 44 శాతం మంది ఫోన్‌‌‌‌పే యూజర్లుగా నమోదయ్యారు. తమ యాప్‌‌‌‌ను ఓపెన్‌‌‌‌ చేసేవారు జాతీయ సగటు కంటే తెలంగాణలో 60 శాతం అధికమని ఫోన్‌‌‌‌పే తెలిపింది