- సోషల్ మీడియా కట్టడి అవసరం
గోదావరిఖని, వెలుగు: కేంద్ర ప్రభుత్వ విధానాలతోనే దేశంలో జర్నలిస్టులకు రక్షణ కరువైందని తెలంగాణ రాష్ట్ర మీడియాఅకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి అన్నారు. కోల్‌బెల్ట్ సీనియర్జర్నలిస్ట్ మునీర్ జీవిత చరిత్రపై ముద్రించిన ‘మునీర్‌భాయ్’ పుస్తక పరిచయ సభను మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో పెట్టుబడిదారుల చేతుల్లోకి మీడియా రంగం వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్‌తో సమాజంలో నాలుగో స్తంభంగా ఉన్న జర్నలిస్టులను, కూలీలను ఓకే గొడుగు కిందకు తీసుకువచ్చారని, ఇది తీరని నష్టమన్నారు. సోషల్ మీడియాలో నియంత్రణ లేకపోవడం వల్ల విచ్చలవిడితనం పెరిగిపోతోందని, దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
జర్నలిజాన్ని నమ్ముకుని జీవితాంతం అన్యాయాన్ని, పాలకుల లోపాలను ఎత్తిచూపుతూ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న జర్నలిస్ట్ మునీర్ జీవితం ఆదర్శప్రాయమని అన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని జర్నలిస్టులకు త్వరలోనే ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ప్రకటించారు. అక్షర ఫౌండేషన్అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ మాదాసి రామ్మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మాధవరావు, జర్నలిస్ట్ సంఘాల లీడర్లు నగునూరి శేఖర్, ఎం.వంశీ, సంపత్ కుమార్, గడ్డం శ్యామ్, కోల లక్ష్మణ్, పి.శ్యామ్ సుందర్, కేఎస్ వాసు, కార్మిక సంఘాల లీడర్లు కె.స్వామి, టి.రాజిరెడ్డి, రియాజ్ అహ్మద్, పి.మల్లికార్జున్, పర్లపల్లి రవి, ఐ.కృష్ణ,కె.విశ్వనాథ్, తోకల రమేశ్, రచయితలు పాల్గొన్నారు.
