నోరు జారుతున్న మంత్రులు..జనం,పత్రికలపై అసహనం

నోరు జారుతున్న మంత్రులు..జనం,పత్రికలపై అసహనం

అధికార పార్టీ మంత్రులు జిల్లాల పర్యటనల్లో నోరు జారుతున్నారు. ప్రశ్నిస్తున్న వారిపై, పత్రికలపై అసహనం ప్రదర్శిస్తున్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే సామాన్య జనంపై కోప్పడుతున్నారు. మొన్న వరంగల్లో మంత్రి కేటీఆర్ పర్యటించినప్పుడు మంత్రి ఎర్రబెల్లి.. ఇప్పుడు అదే జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని ఇలా మాట్లాడారు.

ఇటీవల వరంగల్ సిటీ వానలతో నీట మునగడంతో పరిశీలించేందుకు మంత్రి కేటీఆర్‍ వచ్చారు. జనంతో కేటీఆర్‌ మాట్లాడే టైంలో స్వామి అనే వ్యక్తి అక్కడి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. ఏటా తమ కాలనీ మును గుతోందని.. ఐదారుగురు ఎమ్మెల్యేలు వస్తు న్నరు, పోతున్నరు తప్పితే సమస్య తీరడం లేదన్నారు.ఈ టైంలో మంత్రి ఎర్రబెల్లి ఒక్క సారిగా కోప్పడుతూ అడ్డుకున్నారు. ‘‘ఏయ్‍.. అరేయ్‍.. ఆగు.. ఏం చేయాలో చెప్పురా..’’ అంటూ స్వామిని మాట్లాడకుండా చేశారు. అది సోషల్‍ మీడియాలో వైరల్ అయి ఎర్రబెల్లిపై విమర్శలు వచ్చాయి. తాజాగా సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్‍ యాదవ్‍, మంత్రి ఎర్రబెల్లి కలిసి వరంగల్‍ రూరల్‍ జిల్లాలో పర్యటించారు. మైలారం రిజర్వాయర్‍లో చేప పిల్లలను వదిలి, అక్కడున్న వారితో చేప పిల్లల అంశంపై మాట్లాడుతూ పత్రికలపై నోరు జారారు. ‘‘ఈ మధ్య పత్రికల్లో కొన్ని పిచ్చిరాతలు వచ్చినయి.. ఏదో క్వాలిటీ లేదు. సైజు లేదు. లేకపోతే ఏదేదో.. .. .. అది బొంగయిన్రు అంటూ మాట్లాడుతున్నరు” అని అన్నారు. ఈ కామెంట్లు డిస్కషన్‍కు దారితీశాయి.

చెరువులో పోయగానే.. చచ్చి తేలినయ్‌

మంత్రి తలసాని.. స్వయంగా రిజర్వాయర్ లో వదిలిన వందలాది చేపపిల్లలు చచ్చిపైకి తేలాయి. కార్యక్రమంలో పాల్గొన్నవాళ్లంతా అది చూశారు. ప్రభుత్వం సప్లై చేస్తున్న చేప పిల్లల సైజు తక్కువగా ఉంటోందని.. చాలా వరకు అలా నీళ్లలో వేయగానే చచ్చిపోతున్నాయని మత్స్య కారులు అంటూనే ఉన్నారు. ‘వెలుగు’ పత్రిక ఇటీవలే దీనిపై ఓ కథనాన్ని కూడా ప్రచురించింది. సంబంధిత మంత్రి అయిన తలసాని ఈ సమస్యపై ఎంక్వైరీ చేసి, లోటుపాట్లను సరిచేయడాన్ని వదిలేసి బూతు పురాణం విప్పడంపై విమర్శలొస్తున్నాయి.