కొత్త టెక్నిక్ లతో కోతుల బెడదను కంట్రోల్ చేస్తోన్న తెలంగాణ మంకీ మ్యాన్...

కొత్త టెక్నిక్ లతో కోతుల బెడదను కంట్రోల్ చేస్తోన్న తెలంగాణ మంకీ మ్యాన్...

అడవుల్లో తిరగాల్సిన కోతులు గ్రామాల్లో, రోడ్ల మీద దర్శనమిస్తున్నాయి. తిండి దొరక్క జనావాసాల్లోకి వస్తోన్న కోతులను తిరిగి వాటి ఆవాసాలకు పంపాలంటే ఆషామాషీ విషయం కాదు. తినడానికి ఏదో ఒకటి పెట్టకపోతేనే మీద పడి దాడి చేస్తున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అలాంటిది గుంపులుగా వచ్చే కోతులను అడ్డుకోవాలంటే సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే కొత్త టెక్నిక్​లు ఫాలో అవుతున్నారు తెలంగాణ మంకీ మ్యాన్. అసలు ఎవరీయన? ఆయన ఏంచేస్తున్నారు?

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన శ్రీకర్ రాజు వెటర్నరీ డాక్టర్. చిన్నప్పుడు వాళ్లింట్లో ఉన్న ఆవులతో మంచి అనుబంధం ఉండేది. అది కాస్తా మిగతా జంతువుల పట్ల కూడా ప్రేమ పెంచుకునేలా చేసింది. మహారాష్ట్రలోని పర్బనీలో వెటర్నరీ చదివిన రాజు, 2007లో 
వెటర్నరీ డాక్టర్​గా తిరిగి తెలంగాణకు వచ్చారు. 

కేవలం డాక్టర్​గానే కాకుండా కోతులను సంరక్షించడంలో ప్రత్యేక పాత్ర వహిస్తున్నారు. నిర్మల్ కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రంలో 2,350కు పైగా కోతులకు స్టెరిలైజేషన్ సర్జరీలు చేసి రాష్ట్రంలోనే రికార్డు సృష్టించారు. అందుకే ఆయన్ను అందరూ ‘మంకీమ్యాన్​’ అని పిలుస్తుంటారు. కోతులకు సంరక్షించడంతోపాటు వాటి నియంత్రణకు పాటుపడుతున్న డాక్టర్ భట్టు శ్రీకర్ రాజుకు ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో నిర్మల్ జిల్లా కలెక్టర్ ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసాపత్రాన్ని అందజేశారు. 

సిమ్లా మోడల్

కొండ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ యాపిల్ సాగుతోపాటు టూరిజానికి బెస్ట్ ప్లేస్​. అయితే యాపిల్ తోటలకు, టూరిస్ట్​లకు కోతుల బెడద పెద్ద సమస్యగా మారడంతో అక్కడి ప్రభుత్వం కోతుల నియంత్రణ కోసం స్టెరిలైజేషన్ సర్జరీలు చేసేందుకు సంరక్షణ, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. 

సిమ్లాలో1.5 లక్షలు ఉన్న కోతుల సంఖ్య సంతాన నిరోధక సర్జరీలతో15 ఏళ్ల తర్వాత1.8 లక్షలకు మాత్రమే పెరిగింది. వాస్తవానికి ప్రతీ పదేళ్లకు కోతుల సంఖ్య రెట్టింపు అవుతుండగా సిమ్లాలో మాత్రం కోతుల పునరావాస కేంద్రాల ఏర్పాటు ద్వారా స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేస్తుండటం వల్ల కోతుల సంఖ్యను కంట్రోల్ చేశారు. 

కోతులకు ఆపరేషన్లు ఇలా...

స్టెరిలైజేషన్ సర్జరీలు చేసే కోతులకు ముందురోజు రాత్రి ఫుడ్​, నీళ్లు ఇవ్వరు. తర్వాతి రోజు ఉదయాన్నే బోనులోనే వాటికి మత్తు ఇంజక్షన్ ఇస్తారు. నిద్రలోకి జారుకున్న కోతిని బయటకు తెచ్చి సిబ్బంది దానికి షేవింగ్ చేసి యాంటిసెప్టిక్ ద్రవాన్ని అప్లై​ చేస్తారు. ఆ తర్వాత ఆపరేషన్ థియేటర్​కు తీసుకొచ్చి దానికి స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేస్తారు. కోతికి అనస్థీషియా ఇంజక్షన్ కేవలం అరగంట పనిచేస్తుంది. ఒకవేళ ఆపరేషన్ చేయడం ఆలస్యమైతే అనస్థీషియా మెయింటెనెన్స్ కోసం మరో డోస్ ఇంజక్షన్ ఇస్తారు. 

ఆపరేషన్ పూర్తయ్యాక వాటికి ఆయింట్​మెంట్ పూసి, పెయిన్ కిల్లర్, యాంటీబయాటిక్, టీటీ ఇంజక్షన్ ఇస్తారు. స్టెరిలైజేషన్ చేసిన కోతులకు గుర్తుగా టాటూ వేస్తారు. మూడురోజులపాటు కేంద్రంలోనే అబ్జర్వేషన్​లో ఉంచి కోతులు పూర్తిగా కోలుకున్నాక వాటిని దట్టమైన అడవుల్లో వదిలేస్తారు

స్టెరిలైజేషన్ శస్త్రచికిత్సలు తెలంగాణలోనూ చేసేందుకు వెటర్నరీ డాక్టర్ శ్రీకర్ రాజుకు టూటీకండీ పశువుల ఆసుపత్రిలో శిక్షణ పొందారు. ఆ తర్వాత ఆడకోతులకు స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేయడంలో ఉస్మానియా డాక్టర్ మల్లికార్జునరెడ్డి, హైదరాబాద్ జూపార్క్​ వెటర్నరీ వైద్యుల దగ్గర మూడు రోజులపాటు శిక్షణ తీసుకున్నారు. 

‘‘ట్రైనింగ్ అయిపోయాక పునరావాస కేంద్రంలో ల్యాప్రొస్కోపిక్, జీరో స్పెర్మ్ కౌంట్ వచ్చేలా సర్జరీలు చేయడం మొదలుపెట్టి, గత ఆరేళ్లలో 2,350కు పైగా ఆపరేషన్లు చేశాన’’ని డాక్టర్ శ్రీకర్ రాజు చెప్పారు. రోడ్డు ప్రమాదాలు, విద్యుత్ షాక్‌‌‌‌లు, ఇతర కారణాల వల్ల గాయపడిన కోతులను రక్షించి వాటికి చికిత్స అందించడం ఆయన దినచర్యగా మారింది. స్కూల్స్, కాలేజీల్లో అవేర్​నెస్ ప్రోగ్రామ్స్​ నిర్వహిస్తూ కోతుల సంరక్షణ అవసరాన్ని వివరిస్తున్నారు. 

కోతుల పునరావాస కేంద్రంలో...

కోతుల సంఖ్య పెరగకుండా కంట్రోల్ చేయడానికి దక్షిణాది రాష్ట్రాల్లోనే మొదటిసారి నిర్మల్ జిల్లా చించోలి గ్రామంలో కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి 2020 డిసెంబర్​ 20న ప్రారంభించారు. ఇక్కడ మంకీ ట్రాప్ బోన్లు ఏర్పాటు చేసి వాటిలో పెట్టిన ఫుడ్​ తినడానికి వచ్చిన కోతి ట్రాప్​లో చిక్కుకునేలా చేస్తారు. 

వాటిని మంకీ క్యాచర్లు పట్టుకుని నిర్మల్ కోతుల పునరావాస కేంద్రానికి తరలిస్తారు. రూ.2.25 కోట్లతో నిర్మించిన కోతుల పునరావాస కేంద్రంలో ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, కోతులకు ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించారు.

ఇమ్యూనో వ్యాక్సిన్ 

హాంకాంగ్​లో కోతులకు పునరుత్పత్తి నిలిపివేసేలా ఇమ్యూనో వ్యాక్సిన్ టెక్సిక్ ఇంజక్షన్లు ఇస్తున్నారు. ఒక్క ఇంజక్షన్ రూ.4వేలు కాగా, వీటిని ప్రయోగాత్మకంగా కోతులకు ఇస్తున్నారని డాక్టర్ పేర్కొన్నారు. ఈ ప్రయోగం సక్సెస్​ అయితే కోతుల సంఖ్యను నిరోధించవచ్చన్నారు. 

కోతి కరిస్తే ఏం చేయాలి ?

కోతి కరిచిన ప్రదేశంలో గాయాన్ని కనీసం15 నిమిషాలు సబ్బుతో బాగా కడగాలి. ఆ వెంటనే సమీప ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి, వైద్యుల సూచన మేరకు రేబిస్ టీకాలు, టీటీ ఇంజక్షన్ చేయించుకోవాలి. కోతి కాటు కూడా రేబిస్ ప్రమాదాన్ని కలిగించొచ్చు.

ముందు జాగ్రత్తలివి..

రోడ్లు, దేవాలయాలు, అటవీ పరిసర గ్రామాలు, పట్టణాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉందని తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వెటర్నరీ డాక్టర్ భట్టు శ్రీకర్ రాజు, నిర్మల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గుండపనేని వెంకట రామకృష్ణలు సూచించారు. కోతులకు ఆహారం పెట్టడం వల్ల అవి ఆ ప్రాంతానికి అలవాటుపడతాయి. అందుకని మిగిలిపోయిన ఆహారాన్ని ఇళ్ల ముందు, వీధుల్లో పడేయొద్దు. కిచెన్​ కిటికీలు, తలుపులు మూసేయాలి. కోతులను రెచ్చగొట్టేలా చూడటం, రాళ్లు విసరడం, కొట్టడం వంటివి చేస్తే అవి ఆత్మరక్షణ కోసం దాడి చేసే అవకాశం ఉంది. 

చిన్న పిల్లలు, వృద్ధులను ఒంటరిగా బయటకు పంపొద్దు. కోతి ఫుడ్​ లాక్కోవడానికి ప్రయత్నిస్తే, నెమ్మదిగా వదిలేయాలి. కోతుల వైపు చూసి నవ్వితే.. పళ్లు చూపించడాన్ని అవి శత్రుత్వంగా, దాడికి సంకేతంగా భావిస్తాయి. ఇంటి ప్రహరీ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే, కోతులు వచ్చినప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టడం, కర్రలతో నేలపై బాదడం లేదా లౌడ్‌‌‌‌స్పీకర్‌‌‌‌లలో కుక్కలు మొరిగే శబ్దాలను ప్లే చేయడం ద్వారా వాటిని భయపెట్టొచ్చు. 

కోతులు ఎక్కువగా కూర్చునే గోడలపై లేదా పైపులపై నీటిలో కలిపిన మిరపపొడిని చల్లడం వల్ల ఆ ఘాటుకు అవి దూరంగా ఉంటాయి. అలాగే రైతులు పంటల చుట్టూ నెట్‌‌‌‌లు లేదా కంచెలు ఏర్పాటు చేయాలి. పొలాల్లో శబ్దం చేసే డివైజ్​లు లేదా ఫొటోలు భయపెట్టే బొమ్మలు పులి, ఎలుగుబంటి ఆకారాలు పెట్టొచ్చు. కోతుల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల గురించి స్థానిక పంచాయతీ లేదా మున్సిపాలిటీకి లేదా అటవీశాఖకు సమాచారం ఇవ్వండి.