
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు
కరీంనగర్ సిటీ, వెలుగు : వచ్చే ఎన్నికల్లోపు తెలంగాణలో మార్పు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పోలింగ్ బూత్ అధ్యక్షులు, కార్యదర్శుల సమావేశాన్ని బుధవారం స్థానికంగా నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రాంచందర్‌రావుకు అల్గునూరు చౌరస్తా వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వాగతం పలుకగా, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.
అనంతరం బూత్ అధ్యక్షులు, కార్యదర్శుల సమావేశంలో రాంచందర్‌రావు మాట్లాడుతూ... రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2028లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ వంటి గొప్ప నాయకులను అందించిందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరీంనగర్ – జగిత్యాల రోడ్డు విస్తరణ, రైల్వేలు, రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం రూ. 12 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందని, ఆ పార్టీకి చెందిన కుటుంబ సభ్యులే చెబుతున్నారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు.
కాళేశ్వరం, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టుల నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్‌రావు, డిప్యూటీ మాజీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్ పాల్గొన్నారు.