- నవంబర్ 2 వరకు వారోత్సవాలు
- లోగో, పోస్టర్ ఆవిష్కరించిన విజిలెన్స్ మాజీ కమిషనర్ గోపాల్
హైదరాబాద్, వెలుగు: ప్రజలంతా సమిష్టి బాధ్యతతో అవినీతిని అరికట్టాలని, నిజాయతీ సంస్కృతిని పెంపొందించాలని మాజీ విజిలెన్స్ కమిషనర్, రిటైర్డ్ ఐఏఎస్ ఎంజీ గోపాల్ అన్నారు. తెలంగాణ విజన్ 2047 సిటిజన్ సర్వేలో పాల్గొని రాష్ట్ర పరిపాలన భవిష్యత్తు కోసం విలువైన సూచనలు అందించాలని కోరారు. ప్రతి ఏటా నిర్వహించే విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ఈ ఏడాది అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లోగో, టోల్ ఫ్రీ నంబర్14432 పోస్టర్లను సోమవారం బీఆర్‌కే భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు.
విజిలెన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ శిఖాగోయల్‌తో కలిసి వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘‘విజిలెన్స్ మనందరి బాధ్యత’’ అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కలిగించనున్నారు. ప్రజలతో నేరుగా కమ్యూనికేట్ అవ్వడానికి ఎక్స్(ట్విట్టర్)తో పాటు @tgvigenfo ఇన్‌స్టాగ్రామ్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ విజిలెన్స్ కమిషనర్ గోపాల్, విజిలెన్స్ డైరెక్టర్ ఏఆర్ శ్రీనివాస్ మాట్లాడారు.
విజిలెన్స్ అనేది ఒక విభాగం పని మాత్రమే కాకుండా, ప్రతి ఉద్యోగి అనుసరించాల్సిన నైతిక వృత్తి ధర్మం అన్నారు. ప్రజా జీవితంలో నిజాయతీని నిలబెట్టుకోవడమనేది వ్యవస్థాత్మక క్రమశిక్షణ అని విజిలెన్స్ డీజీ శిఖాగోయల్ పేర్కొన్నారు. అధికారులు అప్రమత్తంగా, న్యాయంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
