- రాష్ట్ర ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఇలంబర్తి
మెదక్ టౌన్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఇలంబర్తి సూచించారు. శనివారం రాత్రి మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, వాహనాల మెయింటెనెన్స్ లోపాలు ప్రమాదాలకు కారణాలవుతున్నాయన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామాల్లో రోడ్డు భద్రతా వర్క్‌షాప్‌లను నిర్వహించడంతో పాటు స్పీడ్గన్ల ఏర్పాటు, ర్యాలీలు తీసి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని వివరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మెదక్‌ను డ్రగ్స్‌రహిత జిల్లాగా మార్చాలి
మెదక్‌ను డ్రగ్స్‌రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ శ్రీనివాస్‌రావు సూచించారు. మెదక్కలెక్టరేట్లో మాదకద్రవ్యాల నియంత్రణపై మానసిక వైద్య నిపుణులతో కలిసి సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, విక్రయాలను నిరోధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు.
మాదకద్రవ్యాలు, గంజాయి ఇతరత్రా మత్తుపదార్థాల వల్ల కలిగే నష్టాలను అర్థమయ్యేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డ్రగ్స్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, బాధితులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బెల్ట్ షాపులు, గుడుంబా స్థావరాలపై పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని, కార్డన్ సెర్చ్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
