- ఎముకలు కొరికే చలిలో 15 రోజులుగా సాధన
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరగబోయే 77వ గణతంత్ర వేడుకల్లో ఈసారి తెలంగాణ బిడ్డలు ప్రత్యేకంగా నిలవబోతున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, ఇతర దేశాధిపతుల ముందు తెలంగాణకే సొంతమైన కళారూపాన్ని ప్రదర్శించనున్నారు. ఇప్పటివరకు ఎందరో కళాకారులు ఎన్నో కళారూపాలను రిపబ్లిక్ డేలో ప్రదర్శించినా... తొలిసారి ఒగ్గుడోలు విన్యాసానికి చోటు దక్కింది.
ఈ చరిత్రాత్మక ప్రదర్శన కోసం సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నుంచి ప్రఖ్యాత ఒగ్గుడోలు కళాకారుడు డాక్టర్ ఒగ్గు రవి బృందానికి ఆహ్వానం అందింది. ఇందులో భాగంగా ఒగ్గు రవి నేతృత్వంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది కళాకారులు ఈనెల 8నే ఢిల్లీ చేరుకున్నారు. ఎముకలు కొరికే చలిలో దాదాపు 15 రోజులుగా కర్తవ్యపథ్ పై ప్రాక్టీస్ చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల ఎన్సీసీ క్యాడెట్ల కవాతు...
త్రివిధ దళాలు, పారా మిలటరీ బలగాలు, ఢిల్లీ పోలీస్ కంటింజెట్లకు ఏమాత్రం తీసిపోకుండా... కేవలం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ సీసీ విద్యార్థులు ఈసారి కవాతు చేయబోతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఏపీ నుంచి మొత్తం 133 మంది ఎన్ సీసీ క్యాడెట్లు పాల్గొంటున్నారు. ఇందులో 78 మంది బాలురు, 55 మంది బాలికలు ఉన్నారు. ఈ టీంను హైదరాబాద్ లోని కవాడిగూడకు చెందిన బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ భరత్ లీడ్ చేయనున్నాడు.
