
- జర్మనీ నుంచి టామ్ కామ్కు మరో ఆఫర్
- 30 మంది ఎలక్ర్టీషియన్లను పంపాలని వినతి
- ఒక్కొక్కరికి రూ.2.60 లక్షల వేతనం
- అప్లై చేసుకోవాలన్న టామ్‌కామ్ అధికారులు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్)కు మరో ఆఫర్ వచ్చింది. ఇటీవల జర్మనీకి 25 మందిని పంపగా.. తాజాగా మరో 30 మందిని పంపాలని ఆ దేశ ప్రతినిధులు టామ్ కామ్ అధికారులను కోరారు. ఈ 30 మందిని ఎలక్ట్రీషియన్లుగా రిక్రూట్ చేసుకుంటామని, వీరికి ఫ్రీ రూమ్, ఫుడ్‌తో పాటు నెలకు 2,600 యూరోల నుంచి 2,700 యూరోలు (మన దేశకరెన్సీ ప్రకారం రూ.2,60,000 నుంచి రూ.2,70,000) చెల్లిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం 2 ఏండ్లకు రిక్రూట్ చేసుకొని తర్వాత పొడిగిస్తామని ఆ దేశ అధికారులు టామ్ కామ్ కు సూచించారు. త్వరలో ఇజ్రాయిల్ తో పాటు ఇతర దేశాలు సైతం జాబ్ ఆఫర్లపై సంప్రదించనున్నారని టామ్ కామ్ అధికారులు చెప్తున్నారు. త్వరలో రష్యాలో సైతం ఉద్యోగాల కోసం ఇక్కడ నుంచి యువతను పంపేందుకు టామ్ కామ్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా అక్కడి దేశ అధికారుల ఆహ్వానం మేరకు ఇటీవల సీఎం సెక్రటరీ అజిత్ రెడ్డి, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, టామ్ కామ్ జీఎం నాగభారతి వారం రోజుల పాటు పర్యటించి వచ్చారు.
అప్లై చేసుకోండి
జర్మనీ జాబ్‌ల కోసం అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకులు అప్లై చేసుకోవాలని టామ్ కామ్ అధికారులు కోరుతున్నారు. 19 ఏండ్ల నుంచి 30 ఏండ్లలోపు వయస్సు ఉండి ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో రెండేండ్ల ఫుల్ టైమ్ కోర్సు, కనీసం 60 శాతం మార్కులతో పాస్ అయిన వాళ్లు అర్హులని అధికారులు నిర్ణయించారు. ఈ ఫీల్డ్ లో కనీసం 2 ఏండ్ల అనుభవం ఉండాలన్నారు. ఈ జాబ్ ల కోసం జర్మనీ భాష నేర్పించేందుకు త్వరలో క్లాస్ లో స్టార్ట్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అర్హతలు ఉన్న యువతీ, యువకులు మరిన్ని వివరాల కోసం 94400 49520 నంబర్ ను సంప్రదించాలని, మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్ లోని టామ్ కామ్ ఆఫీస్ లో వివరాలు తీసుకోవాలని కోరుతున్నారు.
విస్తృతంగా అవగాహన
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఐటీఐ, ఏటీసీల్లో టామ్ కామ్ ఆధ్వర్యంలో చేపడుతున్న రిక్రూట్ మెం ట్లపై కార్మిక శాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అన్ని కేంద్రాల్లో నోటీసు బోర్డుల్లో ఈ జాబ్ నోటిఫికేషన్లను డిస్ ప్లే చేయడంతో పాటు ఎలక్ట్రీషియన్ కోర్సులు పూర్తి చేసిన వారికి ఫోన్లు, మెసేజ్‌ల ద్వారా నోటిఫికేషన్ పంపిస్తున్నారు.