కృష్ణా బోర్డుకు మనమే ఎక్కువ పైసలిచ్చినం

కృష్ణా బోర్డుకు మనమే ఎక్కువ పైసలిచ్చినం
  • నిధులు లేక టెలిమెట్రీల ఏర్పాటు ఆలస్యం

హైదరాబాద్‌‌, వెలుగు: కృష్ణా రివర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ బోర్డు (కేఆర్‌‌ఎంబీ)కి మన రాష్ట్రమే డబ్బులు ఇస్తున్నది. బోర్డు నిర్వహణ ఖర్చులు తెలంగాణ, ఏపీ చెరిసగం భరించాల్సి ఉండగా.. మూడేండ్లుగా ఏపీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ ఏడేండ్లలో బోర్డు ఖాతాలో రూ.32.28 కోట్ల నిధులు చేరగా అందులో 65 శాతానికి పైగా తెలంగాణనే ఇచ్చింది. బోర్డు ఏర్పాటు చేసిన మొదటి నాలుగేండ్లు ఏపీ నిధులు విడుదల చేసినా ఆ తర్వాత పైసా ఇవ్వడం లేదు. కేఆర్‌‌ఎంబీకి నిధులు ఇవ్వడంలో మొదట్లో మొండిగా వ్యవహరించిన తెలంగాణ సర్కారు ఆ తర్వాత రాష్ట్ర వాటా నిధులు క్రమం తప్పకుండా విడుదల చేస్తోంది.

2014–15 నుంచి 2018–19 వరకు ఐదేండ్లలో ఏపీ ప్రభుత్వం బోర్డుకు రూ.12.56 కోట్లు విడుదల చేసింది. 2018–19 నుంచి 2021–22 వరకు తెలంగాణ సర్కారు నాలుగేండ్లలో రూ.19.71 కోట్లు రిలీజ్‌‌ చేసింది. రెండు రాష్ట్రాలు బోర్డుకు రూ.44.48 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ.32.28 కోట్లు మాత్రమే విడుదల చేశాయి. దీంతో ఏ రాష్ట్రం ఎంతమేరకు నీటిని ఉపయోగించుకుంటుందనే లెక్కలు తేల్చే రెండో దశ టెలీమెట్రీ స్టేషన్‌‌లు ఏర్పాటు చేయలేదు. బోర్డుల గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌ను ఏపీ స్వాగతించినా.. గెజిట్‌‌లో పేర్కొన్నట్టుగా రూ.200 కోట్ల సీడ్‌‌ మనీ మాత్రం ఇవ్వలేదు. ట్రిబ్యునల్‌‌ నీటి వాటాలు తేల్చేదాకా ప్రాజెక్టులు బోర్డు నిర్వహణకు అప్పగించేది లేదని తేల్చిచెప్తున్న తెలంగాణ సీడ్‌‌ మనీ విడుదలపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు.