- 25,853 వార్డులు కూడా..
- మూడు విడతల్లో మొత్తం 39,216 మంది సర్పంచ్ అభ్యర్థులు
- వార్డు సభ్యులుగా 2 లక్షలకు పైగా అభ్యర్థులు పోటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి, రెండో, మూడో విడత బరిలో నిలిచే సర్పంచ్, వార్డు సభ్యుల లెక్క తేలింది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 12,723 గ్రామ పంచాయతీలకుగాను 1,205 సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యాయి.
తొలివిడతలో 396, రెండో విడత 415, మూడో విడత 394 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా మూడు దశల ఎన్నికలకు మొత్తం 1,12,242 వార్డులకు 25,853 ఏకగ్రీవమయ్యాయి. మొదటి విడతకు 9,331, రెండో విడతకు 8,304, మూడో విడతకు 7,916 వార్డు సభ్యస్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
మొదటి విడత ఇలా...
గురువారం (11న) తొలి విడత ఎన్నికలకు 4,236 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు ఎన్నికలు నోటిఫై చేస్తే...ఐదు చోట్ల ఎవరూ నామినేషన్లు వేయలేదు. 37,440 వార్డులకుగాను 149 చోట్ల నామినేషన్లు పడకపోవడంతో అక్కడ ఎన్నికలు రద్దయ్యాయి. 396 సర్పంచ్ పదవులు ఏకగ్రీవంకాగా, 3,834 సర్పంచ్ స్థానాలకు 12,960 అభ్యర్థులు పోటీ పడుతున్నారు . 9,633 ఏకగ్రీవమైన వార్డులను మినహాయించాక 27,628 వార్డులకు 65,455 మంది పోటీలో ఉన్నారు.
రెండో విడతలో...
14న రెండోవిడత ఎన్నికలకు 4,332 గ్రామ పంచాయతీలను నోటిఫై చేశారు. 5 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 415 సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు. దీంతో మిగిలిన 3,906 సర్పంచ్ స్థానాలకు 13,128 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 38,322 వార్డులకు నోటిఫై చేయగా 107 వార్డుల్లో ఎవరూ నామినేషన్లు వేయలేదు.
మూడో విడతలో..
17న జరగనున్న మూడోవిడత ఎన్నికలకు 4,157 పంచాయతీల్లోని 11 సర్పంచ్ పదవులకు, 36,434 వార్డుల్లో 112 చోట్ల నామినేషన్లు పడలేదు. 415 సర్పంచ్ స్థానాలు, 7,916 వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 3,752 సర్పంచ్ స్థానాలకు 13,128 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక మిగిలిన 28,406 వార్డులకు 75,2833 మంది పోటీ పడుతున్నారు.

