నేడు (సెప్టెంబర్ 9) అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు

నేడు (సెప్టెంబర్ 9) అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీలో కాకుండా స్థానికంగా ఉండే జాతీయ బ్యాంకుల్లో జమ చేసుకునేందుకు వీలుగా పంచాయతీరాజ్ చట్టానికి ప్రభుత్వం సవరణ చేయనుంది. ఇందుకు సంబంధించిన ‘తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు’ను బుధవారం మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు పంచాయతీల సొంత ఆదాయాన్ని ట్రెజరీలోనే జమ చేయాల్సి వస్తోంది.

నిధుల డ్రాలో జాప్యం జరగడంతో పాటు పలు సందర్భాల్లో నిధులు ల్యాప్స్ కావడం లేదా ఇతర అవసరాలకు డైవర్ట్ అవుతున్నాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో తాగునీటి సరఫరా, మోటార్ల రిపేర్లు, పారిశుధ్య పనులు, వీధి దీపాల నిర్వహణ వంటి అత్యవసర ఖర్చులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చట్ట సవరణ ఆమోదం పొందితే పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని సమీపంలోని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో జమ చేసుకుని, అవసరాల మేరకు వెంటనే డ్రా చేసి అభివృద్ధి, నిర్వహణ పనులకు ఖర్చు చేయవచ్చు.