- విమెన్ ఫ్రెండ్లీలో ‘ఫసల్వాడి’కి జాతీయ అవార్డు
- జాతీయ పంచాయతీ అవార్డు -2025ను ప్రకంటించిన కేంద్రం
న్యూఢిల్లీ, వెలుగు: జాతీయ స్థాయిలో తెలంగాణ పల్లెలు మరోసారి మెరిశాయి. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రకటించిన ‘జాతీయ పంచాయతీ అవార్డులు– 2025’లో రెండు అవార్డులను దక్కించుకున్నాయి. సుపరిపాలన అందిస్తున్న పంచాయతీగా వికారాబాద్ జిల్లాలోని ‘మోతుకుపల్లి’ గ్రామానికి దేశంలో 3వ ర్యాంకు లభించింది. మహిళా పాలనలో సంగారెడ్డి జిల్లాలోని ఫసల్వాడి గ్రామ పంచాయతీకి 3వ ర్యాంకు లభించింది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబర్చిన గ్రామ పంచాయతీలకు జాతీయ అవార్డులను కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ శనివారం ప్రకటించింది.
ఈ ప్రతిష్టాత్మక దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అవార్డులు దక్కించుకున్నాయి. ఇందులో 42 పంచాయతీలు ఉత్తమ గ్రామాలుగా ఎంపికయ్యాయి. ఈసారి కర్ణాటక అత్యధికంగా 6 అవార్డులతో మొదటి స్థానంలో నిలిచింది. ఏపీ, ఒడిశా రాష్ట్రాలు ఒక్కొక్కటి 5 అవార్డులతో రెండో స్థానంలో నిలిచాయి. బిహార్‌లోని మోతీపూర్ పంచాయతీకి క్లైమేట్ యాక్షన్ స్పెషల్ పంచాయతీ అవార్డు దక్కింది. జూన్ 3న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
