కుక్కలకు కు.ని ఆపరేషన్లు!..పల్లెల్లో తీరనున్న వీధి కుక్కల బెడద.. జిల్లాకో ఆపరేషన్ థియేటర్

కుక్కలకు కు.ని ఆపరేషన్లు!..పల్లెల్లో తీరనున్న వీధి కుక్కల బెడద.. జిల్లాకో ఆపరేషన్ థియేటర్
  •     వికారాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్.. త్వరలోనే రాష్ట్రమంతా అమలు
  •     ఒక్కో కుక్కకు రూ.100 నుంచి రూ.150 చెల్లింపు
  •     సర్కార్​ నిర్ణయంపై సర్పంచ్​ల హర్షం

హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో వీధి కుక్కల బెడదను తొలగించేందుకు రాష్ట్ర సర్కార్​పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది. ప్రతి జిల్లాలో ప్రత్యేక ఆపరేషన్ థియేటర్​ను ఏర్పాటు చేసి పల్లెల్లో వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని నిర్ణయించింది.  పైలట్ ప్రాజెక్టుగా వికారాబాద్ జిల్లాతోపాటు మరో రెండు జిల్లాల్లో ప్రారంభించి సక్సెస్ అయితే రాష్ట్రంలోని 12,760 పంచాయతీల్లో నిర్వహించనున్నారు. ఆపరేషన్ చేసినందుకుగాను ఒక్కో కుక్కకు రూ.100 నుంచి రూ.150 వరకు చెల్లించనున్నారు. వెటర్నరీ డిపార్ట్​మెంట్ సమన్వయంతో ఏబీసీ (అనిమల్ బర్త్ కంట్రోల్) సర్జరీలు చేయనున్నారు. 

సర్పంచ్ ఎన్నికల సమయంలో కుక్కలు, కోతుల బెడద నుంచి విముక్తి కలిగిస్తామని ఇచ్చిన హామీ మేరకు పలు గ్రామాల్లో కుక్కలకు విషమిచ్చి చంపిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు హన్మకొండ, కామారెడ్డి, సిద్ధిపేటతో పాటు పలు జిల్లాల్లో చోటు చేసుకోగా.. జంతు ప్రేమికులు కేసులు పెట్టడంతో పాటు కోర్టులనూ ఆశ్రయించారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆడ, మగ కుక్కలకూ ఆపరేషన్లు..

కుక్కలకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ను సాంకేతికంగా ఏబీసీ సర్జరీ లేదా స్టెరిలైజేషన్ అంటారు. ఇందులో ఆడ, మగ కుక్కలకు వేర్వేరుగా ఆపరేషన్లు చేస్తారు. మగ కుక్కలకు న్యూటరింగ్, ఆడ కుక్కలకు స్పేయింగ్ ఆపరేషన్ చేస్తారు. దీనివల్ల కుక్కలు సంతానాన్ని ఉత్పత్తి చేసే శక్తిని కోల్పోవడంతోపాటు దూకుడు స్వభావం తగ్గి, కరిచే ప్రమాదం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. అయితే ఆపరేషన్లకు ముందు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కనీసం 6 నెలల కంటే ఎక్కువ వయస్సు ఉండి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న కుక్కలకే ఆపరేషన్ చేయాలి. 

చిన్న పిల్లలకు (పప్పీస్), అనారోగ్యంతో ఉన్న కుక్కలకు సర్జరీ చేయకూడదు. అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ ప్రెగ్నెన్సీ ఉన్న ఆడ కుక్కలకు ఆపరేషన్ చేయవద్దు. ఆపరేషన్ చేసే సమయంలోనే కుక్కకు రేబీస్ వ్యాధి రాకుండా యాంటీ రేబీస్ టీకా వేయాలి. ఆపరేషన్ పూర్తి కాగానే యాంటిబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తూ 3 నుంచి 4 రోజుల పాటు ప్రత్యేక షెల్టర్ హోమ్‌‌‌‌‌‌‌‌లో ఉంచుతారు. తర్వాత ఆపరేషన్ పూర్తయిన కుక్క చెవికి చిన్న గాటు పెడతారు. కోలుకున్న తర్వాత కుక్కను ఎక్కడైతే పట్టుకున్నారో అక్కడే తిరిగి వదిలిపెడతారు.

సుప్రీంకోర్టు గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్ ప్రకారమే..

వీధి కుక్కల నివారణ, సంతాన నియంత్రణపై సుప్రీంకోర్టు గతంలో మార్గదర్శకాలు జారీ చేసింది. కుక్కలను చంపడం చట్టరీత్యా నేరం, కేవలం అనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) పద్ధతిలోనే వాటిని నియంత్రించాలి. దీంతో కుక్కలకు ఆపరేషన్లు చేసేందుకు థియేటర్లు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రోగ్రామ్​సక్సెస్​కు వెటర్నరీ,  పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పని చేయడంతోపాటు స్టేట్ లెవల్లో ఒక ఆఫీసర్​ను నియమించనున్నట్లు తెలిసింది.