బ్లాక్స్పాట్ ల దగ్గర.. యాక్సిడెంట్లకు పుల్స్టాప్... 44వ హైవేపై ప్రమాదాల నివారణపై పోలీసుల ఫోకస్

బ్లాక్స్పాట్ ల దగ్గర.. యాక్సిడెంట్లకు పుల్స్టాప్... 44వ హైవేపై ప్రమాదాల నివారణపై పోలీసుల ఫోకస్
  • నేషనల్​ హైవే అథారిటీ ఆఫీసర్లతో మెదక్​ ఎస్పీ చర్చలు
  • అదనపు రోడ్ల నిర్మాణానికి ప్రపోజల్స్

మెదక్/మనోహరాబాద్, వెలుగు: 44వ హైవేపై జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే గుర్తించిన బ్లాక్​స్పాట్​ల వద్ద అదనపు రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రపోజల్స్​ సిద్ధం చేశారు. ట్రాఫిక్​ క్రమబద్దీకరించాలని నిర్ణయించారు. దేశంలోనే అతి పొడవైన హైవే 44 మెదక్  జిల్లా పరిధిలో 55 కిలో మీటర్లు ఉంటుంది. ఈ రోడ్డుపై రాత్రింబవళ్లు 15  వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. 

వివిధ రాష్ట్రాల నుంచి వివిధ రకాల ఉత్పత్తులు, ముడిపదార్ధాలు రవాణా చేసే భారీ కంటెయినర్లు, ట్రక్కులు, లారీలతో పాటు మెదక్, బోధన్, బాన్సువాడ, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ​ఆర్మూర్, కామారెడ్డి, మేడ్చల్, జీడిమెట్ల, మహారాష్ట్ర నుంచి వందలాది ఆర్టీసీ, ప్రైవేట్​ బస్సులు నడుస్తాయి. ఇక ఈ రూట్​లో వేలాది కార్లు తిరుగుతుంటాయి. 

ఈక్రమంలో వివిధ ప్రాంతాల్లోని బైపాస్​ సర్కిళ్లు, గ్రామాలకు వెళ్లే దారులు ఉన్న చోట తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏటా 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోతుండగా, వందలాది మంది గాయాలపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో హైవేపై ప్రమాదాల నివారణకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు
 ప్రారంభించారు.

ఆ ఒక్క చోటే 32 మంది మృతి..

హైవే 44పై మనోహరాబాద్  మండలం పరిధిలోనే గతేడాది జూన్  నుంచి ఈ ఏడాది ఆగస్టు 10 వరకు 63 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 32 మంది ప్రాణాలు కోల్పోగా, 45 మంది గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది యువకులే ఉన్నారు.
పోలీసుల నజర్..జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న మనోహరాబాద్  మండలం కూచారం, కాళ్లకల్​ బంగారమ్మ ఆలయ  ప్రాంతం, దండుపల్లి చౌరస్తాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు. 

అక్కడ ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు స్వయంగా​ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ప్రమాదాలకు కారణాలేంటి? రోడ్డు ప్రమాదాలు జరగకుండా శాశ్వత పరిష్కారానికి ఏం చేయాలనే దానిపై నేషనల్​ హైవే అథారిటీ అధికారులతో చర్చించారు. కూచారం వద్ద సర్వీస్  రోడ్డు ఏర్పాటుకు ప్లాన్  రూపొందించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌‌‌‌ను క్రమబద్ధీకరించడంపై దృష్టి పెట్టారు. కాళ్లకల్  బంగారమ్మ ఆలయం వద్ద బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

రూ.77 కోట్లతో ఆర్వోబీలు

రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న చేగుంట మండలం వడ్యారం బైపాస్​ సర్కిల్​ వద్ద రోడ్డు ఓవర్​ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు కాగా పనులు జరుగుతున్నాయి. అలాగే రామాయంపేట బైపాస్  రోడ్డులో ఆర్వోబీ నిర్మాణానికి ఇటీవలే రూ.47 కోట్లు మంజూరయ్యాయి. ఈ రెండు చోట్ల ఆర్వోబీల నిర్మాణం పూర్తయితే చాలా వరకు రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుంది.