- సైబర్ క్రిమినల్స్‌కు చెక్ పెట్టొచ్చన్న సజ్జనార్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: పెరుగుతున్న ఏఐ టెక్నాలజీ కొత్త కొత్త మోసాలకు దారి తీస్తోంది. దానిపై అవగాహన లేకపోతే ఆర్థికంగా, ఇతర విధాలుగా నష్టపోయే అవకాశాలుంటాయి. ఇటీవల మెగాస్టార్చిరంజీవి కూడా డీప్ ఫేక్బారిన పడి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. అచ్చం ఆయనలాగే ఉన్న వ్యక్తిని ఏఐ డీప్ ఫేక్- ద్వారా క్రియేట్చేసి పోర్నోగ్రాఫిక్ వీడియోలు తయారు చేసి పలు వెబ్సైట్లలో పోస్ట్‌చేశారు. ఈ తరహా నేరాలే కాకుండా ఈ మధ్య మనకు కుటుంబసభ్యుల్లా, స్నేహితుల్లా వీడియో కాల్స్‌చేసి డబ్బులు అడుగుతున్న మోసాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఈ తరహా నేరాలు సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకునే కాకుండా సామాన్య పౌరులను టార్గెట్ చేసి మరీ చేస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే ‘సేఫ్‌వర్డ్’ యూజ్చేయాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
సేఫ్ వర్డ్‌తో డీప్ ఫేక్ నుంచి సేఫ్..
ఏఐ నుంచి జరుగుతున్న మోసాలపై అవగాహన ఉండాలని, ముఖ్యంగా డీప్ ఫేక్ స్కామ్స్‌పై జాగ్రత్తగా ఉండాలని, దీని బారి నుంచి తప్పించుకోవాలంటే ‘సేఫ్ వర్డ్స్’(రహస్య పదాలు) వాడమని సీపీ సజ్జనార్ సూచిస్తున్నారు. ఉదాహరణకు.. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో వీడియో కాల్స్‌లో రహస్య పదాలను ఉపయోగించి, ఫేక్ వీడియోలను గుర్తించవచ్చని అంటున్నారు. దీనివల్ల సైబర్ ఫ్రాడ్స్ నుంచి బయటపడవచ్చంటున్నారు. కేవలం 30 సెకన్ల ఆడియో, వీడియోతో మన కుటుంబసభ్యులు, స్నేహితులు, బాస్ లేదా ప్రభుత్వ అధికారుల గొంతులను కచ్చితంగా క్లోన్ చేసి మోసం చేసే వీలుందంటున్నారు. ఇలాంటి డీప్ ఫేక్ మోసాలను అడ్డుకోవడానికి ముందుగా మనం రెగ్యులర్‌గా మాట్లాడే వారితో, కుటుంసభ్యులతో, ఆఫీసులోనే కొలిగ్స్‌తో సేఫ్ వర్డ్ (రహస్య పదం)ను ముందుగా నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు.
ఏఐ మోసాలు ఎలా జరుగుతున్నాయి
ఇవాళ రేపు సోషల్ మీడియాలో అకౌంట్ లేని వ్యక్తులు లేరు. ఏదో ఒక ప్లాట్ఫామ్లో మన వీడియో కానీ, వాయిస్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే మన ఫోన్హ్యాక్చేసి మన వాయిస్రికార్డ్ చేసే అవకాశం కూడా ఉంది. రకరకాల సోర్సెస్నుంచి తీసుకున్న ఆడియో, లేక వీడియోతో ఏఐ ద్వారా పూర్తిగా క్లోనింగ్చేస్తారు. అచ్చం మనలాంటి వీడియోను, ఆడియోలను సృష్టిస్తారు. -ఉదాహరణకు పైన చెప్పిన కేస్‌స్టడీలో ‘అమ్మా.. కార్ యాక్సిడెంట్ అయ్యింది.. డబ్బు పంపు’ అనగానే ఆ తల్లి తన బిడ్డే అనుకుని ..ఏమైందో అని కంగారు పడి డబ్బులు పంపించింది. అదే మీకు ఏఐ వల్ల జరుగుతున్న మోసాల గురించి అవగాహన ఉన్నట్టయితే ఆ కాల్‌ను క్రాస్చెక్చేసుకునే అవకాశం ఉండేది.
సేఫ్ వర్డ్‌తో ఎలా చెక్ పెట్టొచ్చంటే..
ఎవరైనా వ్యక్తులు మన కుటుంబీకుల లెక్కనో.. లేక స్నేహితుల మాదిరో వీడియో కాల్చేసినప్పుడు మనకు ఎలాంటి సందేహం రాదు.. కానీ, డబ్బులు అడిగినప్పుడో.. కొంచం అనుమానపడేలా మాట్లాడుతున్నప్పుడో సేఫ్వర్డ్స్అవసరం ఏర్పడుతుంది. అందుకనే సేఫ్ వర్డ్ ను మన సొంత వ్యక్తులు అనుకునే వారితోనే షేర్చేసుకోవాలి. అది కూడా రహస్య పదం లేదా ప్రశ్న-కు సంబంధించిన సమాధానం అయి ఉండాలి. ఉదాహరణకు మన్మథుడు సినిమాలో నాగార్జున.. ధర్మవరపు సుబ్రహ్మణ్యం పెట్టుకునే క్వశ్చన్అండ్ఆన్సర్ఫార్మాట్అయి ఉండొచ్చు. లేక ఏదైనా వర్డ్కూడా అయ్యి ఉండొచ్చు..
ఎలా సెటప్ చేయాలి?
ఇద్దరి మధ్య లేదా కుటుంబీకులు మాత్రమే గుర్తించేలా సేఫ్‌వర్డ్ ప్రత్యేకంగాఉండాలి. పాస్‌వర్డ్స్, పుట్టినరోజులు, పెంపుడు పేర్లు వద్దు. ఉదాహరణకు ‘మన మొదటి ట్రిప్ ఎక్కడికి’ అనగానే.. ‘గోవా 2018’ అన్న సేఫ్వర్డ్ఉండాలి. దాన్ని రహస్యంగా ఉంచాలి. ఆన్లైన్లో పోస్ట్ చేయవద్దు. వేర్వేరు గ్రూప్‌లకు వేర్వేరు సేఫ్వర్డ్స్ఉండాలి. కుటుంబానికి ఒకటి, ఆఫీసుకు మరొకటి అలా పెట్టుకోవాలి. గేమ్ లాగా టెస్ట్ చేసి అందరూ గుర్తుంచుకునేలా ఉంటే.. సేఫ్‌వర్డ్ అలవాటవుతుంది. దీంతోపాటు నమ్మకమైన నంబర్స్‌కు మాత్రమే కాల్‌బ్యాక్ చేయాలి. వీడియో కాల్ వచ్చినప్పుడు సేఫ్ వర్డ్ అడగాలి. సేఫ్వర్డ్లేకపోతే.. ఇద్దరికీ తెలిసిన ప్రశ్నలు అడగాలి. ఎదుటి వ్యక్తి దానికి సరైన సమాధానం చెప్తేనే సేఫ్ అని కన్ఫార్మ్ అయినట్టు.
మౌనిక హైదరాబాద్‌లోని ఒక కంపెనీలో టెలీ కాలర్గా పని చేస్తోంది. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ పదుల సంఖ్యలో కాల్స్ మాట్లాడాల్సి ఉంటుంది. ఓ రోజు ఆమె తల్లికి ఫోన్ వెళ్లింది. అందులో ‘అమ్మా.. నాకు యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నా. అర్జంట్‌గా డబ్బులు కావాలి.. హాస్పిటల్ బిల్ డెస్క్ నంబర్ ఇది ’ అని కూతురు చెప్పడంతో ఆ తల్లి క్షణాల్లో డబ్బులు పంపించింది. తర్వాత మళ్లీ డబ్బులు కావాలంటూ ఫోన్ వచ్చింది. ఆ కాల్ మాట్లాడుతుండగానే మౌనిక ఆఫీస్నుంచి ఇంటికి వచ్చి తల్లి ముందు నిల్చుంది. ఇదేంటా అని చూస్తే అది వాయిస్క్లోనింగ్ ద్వారా వచ్చిన కాల్ అని తెలిసి అవాక్కయ్యారు.
