టీఆర్ఎస్ వాళ్లకే ఫ్రెండ్లీ పోలీస్ : వైఎస్ షర్మిల

టీఆర్ఎస్ వాళ్లకే ఫ్రెండ్లీ పోలీస్ : వైఎస్ షర్మిల

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పోలీసులు టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ గా ఉంటున్నారని.. మిగతా పార్టీలను, సామాన్యులను క్రూరంగా అణచివేస్తున్నారని వైఎస్ఆర్టీపీ ప్రెసిడెంట్ షర్మిల అన్నారు. ఆదివారం నుంచి మళ్లీ పాదయాత్రను ప్రారంభిస్తున్నందున డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు శుక్రవారం ఆమె డీజీపీ ఆఫీసుకు వెళ్లారు. డీజీపీ లేకపోవడంతో అడిషనల్ డీజీ జితేందర్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. ఇటీవల ఆపిన చోటు నుంచే పాదయాత్రను తిరిగి స్టార్ట్ చేస్తున్నామని, ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పామన్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందన్నారు. తాము ఎక్కడా లా అండ్ ఆర్డర్ ను ఉల్లంఘించలేదని, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించలేదన్నారు. అధికార పార్టీ నేతలే తమ వాహనాలపై దాడులు చేస్తుంటే పోలీసులు పట్టించుకోలేదన్నారు. పాదయాత్ర చేస్తమంటే టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని, అలా మాట్లాడుతున్నారంటే వాళ్లు తాలిబాన్లు కాదా? వాళ్ల నేత కేసీఆర్ తాలిబాన్ ప్రెసిడెంట్ కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆస్తులన్నీ ప్రజల నుంచి దోచుకున్నవేనని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఎంక్వైరీ జరగటం మంచిదేనన్నారు. మంత్రి కేటీఆర్ రియల్ ఎస్టేట్ దోపిడీపై కూడా ఎంక్వైరీ చెయ్యాలని ఆమె డిమాండ్ చేశారు.   

బీజేపీతో కేసీఆర్ చెట్టాపట్టాల్ 

బీజేపీకి తాను దత్తపుత్రిక అన్న ఆరోపణలపై షర్మిల ఫైర్ అయ్యారు. కేంద్ర హామీలపై తాను ప్రశ్నిస్తుంటే దత్తపుత్రిక ఎలా అవుతానో చెప్పాలన్నారు. బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకొని డ్యూయెట్లు పాడింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ‘‘తమిళిసై రాష్ట్ర గవర్నర్. నేను ఓ పార్టీకి అధ్యక్షురాలిని. మేం ఇద్దరం ఒకే పాత్ర ఎలా పోషిస్తాం? తెలంగాణలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాను. రిపోర్ట్ తెప్పించుకోవాలని కోరాను. నాపై చేసే గోబెల్స్ ప్రచారాన్ని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు” అని షర్మిల అన్నారు. అనంతరం లోటస్ పాండ్ లో పాదయాత్రపై పార్టీ నేతలతో ఆమె సమావేశమయ్యారు. పాదయాత్రకు అంతా తరలిరావాలని కోరారు. దాడులు చేసినా, కొట్టినా, జైల్లో పెట్టినా, చంపినా బెదిరేది లేదన్నారు.