పవర్ పరేషాన్ ఎల్ నినో ఎఫెక్ట్ తో కరెంటు షార్టేజ్

పవర్ పరేషాన్  ఎల్ నినో ఎఫెక్ట్ తో కరెంటు షార్టేజ్
  •  పవర్ ఎక్స్చేంజీల్లో పోటీతో పెరిగిన రేటు
  • యూనిట్​కు రూ. 10 పెట్టినా దొర్కుతలే 
  • 19,543 మెగావాట్లకు చేరిన పీక్ డిమాండ్
  • 40 రోజుల్లో 328.39 మిలియన్ యూనిట్ల లోటు
  • యూపీ, పంజాబ్, ఏపీ, కేరళలోనూ సంక్షోభం
  • రాత్రి వేళ రోజూ 5,500 మెగావాట్ల కరెంట్ గ్యాప్
  • పెరిగిన ధరలతో డిస్కంలపై తీవ్ర భారం 

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో విద్యుత్ రంగం గతంలో ఎన్నడూ లేనంత  సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది.  ఎల్‌‌‌‌నినో వల్ల వర్షాలు ముఖం చాటేయడం, భూగర్భ జలాలు అడుగంటడం,  ఎండలు మండుతుండడం, ఉక్కపోతల కారణంగా కరెంట్​ వినియోగం అంతకంతకూ పెరిగి గ్రిడ్​ విలవిల్లాడుతున్నది. కరెంట్‌‌‌‌ ఎక్స్చేంజీల్లో తీవ్ర పోటీ ఏర్పడడంతో  యూనిట్‌‌‌‌కు రూ. 10 పెట్టినా దొరకని పరిస్థితి నెలకొన్నది. ఈ నెల 9న ఉదయం 10.41 గంటలకు రాష్ట్ర విద్యుత్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది. పీక్ డిమాండ్ ఏకంగా 19,543 మెగావాట్లకు చేరుకున్నది. 

గత ఖరీఫ్‌‌‌‌లో గరిష్ట డిమాండ్ 16,613 మెగావాట్లతో పోలిస్తే ఏకంగా 17 శాతం అధికంగా నమోదు కావడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు పరేషాన్‌‌‌‌లో పడ్డారు. వర్షాల్లేక పంటలను కాపాడుకునేందుకు రైతులు వ్యవసాయ మోటార్లను నిరంతరం ఆన్ చేయడం,  ఎత్తిపోతల ప్రాజెక్టులు ఒకేసారి పనిచేయడం గ్రిడ్‌‌‌‌పై తీవ్ర ఒత్తిడిని పెంచింది. పగటి పూట ఇలా ఉంటే.. చీకటి పడ్తే పెరుగుతున్న గృహవిద్యుత్​ వినియోగం చుక్కలు చూపిస్తున్నది. ఆగస్టు 21 నుంచి కేవలం 40 రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో ఏకంగా 328.39 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ లోటు ఏర్పడడం రాష్ట్రంలో  కరెంట్ సమస్యకు అద్దంపడుతున్నది. 

డిస్కంల పరిస్థితి అగమ్యగోచరం..

సెప్టెంబర్ 8న కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే గరిష్టంగా 8,105 మెగావాట్ల లోటు తలెత్తడంతో గ్రిడ్ బ్యాలెన్స్ ​దెబ్బతిని వ్యవస్థ ప్రమాదపు అంచులకు చేరింది. దీంతో కంగుతిన్న విద్యుత్​శాఖ ఉన్నతాధికారులు పవర్​ఎక్స్చేంజీల్లో యూనిట్‌‌‌‌కు రూ.10 గరిష్ట ధర చెల్లించేందుకు సిద్ధపడినా తగినంత విద్యుత్ లభించక  డిస్కంల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రంలో 55 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. ఈ పొలాలు కోతకు రావాలంటే మరో నెల పట్టొచ్చు. అప్పటిదాకా వర్షాలు లేక  ఎండలు ఇలాగే మండుతుంటే గృహ వినియోగమూ పెరిగి గ్రిడ్​​పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన నెలకొన్నది.   

యూనిట్​10.. డిస్కంలపై భారం.. 

దేశవ్యాప్తంగా కరెంట్​ కొరత నేపథ్యంలో పవర్ ఎక్స్చేంజీల్లో ప్రైవేట్ వ్యాపారులు విద్యుత్ రేట్లను విపరీతంగా పెంచేయడంతో డిస్కంలపై ఆర్థిక భారం పడుతున్నది. పగటిపూట మార్కెట్ ధర యూనిట్‌‌‌‌కు రూ.2 ఉంటే.. సాయంత్రం 4 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు  గరిష్ట పరిమితి అయిన ఫ్లాట్ రూ.10కి చేరుతున్నది. డే- అహెడ్ మార్కెట్ (డీఏఎం)లో సగటున రూ.7.90, రియల్ టైమ్ మార్కెట్ (ఆర్​టీఎం)లో రూ.7.95 గా నమోదవుతున్నది. 

తీరా రూ.10 పెట్టి బిడ్లు వేసినా మార్కెట్లో విక్రయించే పరిమాణం తగ్గిపోవడంతో కొనుగోలు ఆర్డర్లు కార్యరూపం దాల్చడంలేదు. దేశవ్యాప్తంగా ఇదే సంక్షోభం ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ తెచ్చుకునే మార్గాలూ మూసుకుపోతున్నాయి. బొగ్గు సమస్యతో యూపీలో 2 వేల నుంచి 3 వేల మెగావాట్ల లోటు రాగా, పంజాబ్‌‌‌‌లో థర్మల్ ప్లాంట్లు ఆగి పరిశ్రమలకు 8 నుంచి 10 గంటల కోతలు విధించారు. ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా అంతరాయాలు ఏర్పడగా, కేరళ సైతం అధిక ధరలతో కొనుగోళ్లకు దిగుతున్నది.

జాతీయస్థాయిలోనూ ఎల్‌‌నినో ఎఫెక్ట్‌‌తో ఆగస్టులో విద్యుత్ వినియోగం 12.85 శాతం పెరిగి.. 169.01 బిలియన్ యూనిట్లకు, దేశవ్యాప్త పీక్ డిమాండ్ 270.83 గిగావాట్లకు చేరింది. దీంతో దేశవ్యాప్తంగా కరెంట్‌‌కు తీవ్ర పోటీ ఏర్పడి, మార్కెట్లో కొందామన్నా దొరకని పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెప్తున్నారు.

దినదిన గండమే 

రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోతుండడం, థర్మల్​ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేకపోవడం,  సోలార్​ కెపాసిటీ నామమాత్రం కావడం,  వీటన్నింటికీ తోడు నిల్వ ఆధారిత పంప్డ్ స్టోరేజ్ (పీఎస్పీ), బ్యాటరీ స్టోరేజ్ (బీఈఎస్ఎస్) ఏర్పాట్లు లేకపోవడం విద్యుత్​రంగానికి సమస్యగా మారిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ పీక్ డిమాండ్ సుమారు 17,800 మెగావాట్లు నమోదు కాగా.. 26 నాటికి అది 18,200 మెగావాట్లకు,  27 నాటికి 18,650 మెగావాట్లకు చేరుకున్నది. 

ఇక సెప్టెంబర్ 28న టీజీఎస్పీడీసీఎల్​ పరిధిలో మధ్యాహ్నం వేళ ఆల్‌‌టైమ్ రికార్డు స్థాయిలో 12,044 మెగావాట్ల  పీక్ డిమాండ్ నమోదైంది. అదేరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాయంత్రం 6.42 గంటలకు రికార్డు స్థాయిలో 4,072 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదు కాగా, రోజువారీ వినియోగం 82.89 మిలియన్ యూనిట్లకు పెరిగింది. ఈ 4 రోజుల్లో టీజీఎన్​పీడీసీఎల్​ పరిధిలో వ్యవసాయ లోడ్ ఎక్కువగా ఉండడంతో రోజువారీ సగటు డిమాండ్ 6,800 మెగావాట్ల నుంచి 7,100 మెగావాట్ల వరకు కొనసాగింది. మొత్తంగా సెప్టెంబర్ 28 నాటికి  రెండు డిస్కంల సమగ్ర డిమాండ్ 19,100 మెగావాట్లు దాటగా, అంతకంటే ముందు సెప్టెంబర్ 9న నమోదైన ఆల్‌‌టైమ్ రికార్డు 19,543 మెగావాట్ల గరిష్ట మార్కుకు సమీపంలో విద్యుత్ వాడకం సాగింది. ఈ పీక్​ డిమాండ్​ కొద్ది రోజుల్లోనే బ్రేక్​ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఆ రోజు గండం గట్టెక్కారిలా.. 

ఆల్‌‌టైమ్ రికార్డు నమోదైన సెప్టెంబర్ 9 నాటి గణాంకాలు విద్యుత్ ఉత్పత్తి ఎంత దయనీయంగా ఉందో వెల్లడిస్తున్నాయి. ఉదయం 10.41 గంటలకు 19,543 మెగావాట్ల డిమాండ్ ఉన్నప్పుడు.. రాష్ట్ర సొంత జెన్‌‌కో థర్మల్ ప్లాంట్ల ద్వారా 3,996 మెగావాట్లు, సింగరేణి నుంచి 1,104 మెగావాట్లు, కేంద్ర వాటా ద్వారా 2,317 మెగావాట్లు కలిపి మొత్తం  7,575 మెగావాట్ల థర్మల్ విద్యుత్ మాత్రమే లభించింది. 

మిగతా డిమాండ్‌‌ను సోలార్ పవర్​ద్వారా 6,306 మెగావాట్లు, ఇతర మార్గాల్లో 5,193 మెగావాట్లు కొని నెట్టుకొచ్చారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు డిమాండ్ 13,072 మెగావాట్లు ఉండగా, సోలార్ ఉత్పత్తి ఒక్కసారిగా 432 మెగావాట్లకు పడిపోయింది. ఆ సమయంలో అందుబాటులో ఉన్న అన్ని వనరుల ద్వారా 11,672 మెగావాట్లు మాత్రమే సరఫరా సాధ్యం కావడంతో ఏకంగా 1,400 మెగావాట్ల తక్షణ కొరత ఏర్పడింది. అంతకుముందు సెప్టెంబర్ 8న కూడా సాయంత్రం సోలార్ ఆగిపోవడంతో ఏకంగా 2,497 మెగావాట్ల లోటు తలెత్తింది. ఈ సరఫరా లోటు కారణంగా క్షేత్రస్థాయిలో పల్లెలు, పరిశ్రమల్లో అప్రకటిత కరెంట్ కోతలు అమలయ్యాయి. 

వ్యవసాయ ఫీడర్లలో ఓవర్‌‌లోడ్ వల్ల నిరంతరం ట్రిప్పులు, లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తాయి. సెప్టెంబర్ 10న 47.5 మిలియన్ యూనిట్లు, 11న ఏకంగా 48 మిలియన్ యూనిట్ల మేర సరఫరా కోతలు విధించాల్సి వచ్చింది. కేవలం సెప్టెంబర్ 10 నుంచి 21 మధ్య 12 రోజుల్లోనే మొత్తం 324.8 ఎంయూల విద్యుత్ కొరత ఏర్పడటంతో అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో సరఫరాను నిలిపివేసి.. లోడ్ రిలీఫ్ చేపట్టారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు బోర్లు వేసిన సమయాల్లో కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఫీడర్లకు సైతం పీక్ అవర్లలో విద్యుత్ నిలిపివేసినట్టు అధికారులు తాజాగా ప్రభుత్వానికి నివేదించారు.

చీకటి పడిందా గుండె గుబేల్​
పగటిపూట సోలార్​విద్యుత్, థర్మల్ పవర్ ​అందుబాటులో ఉండడం వల్ల పీక్ డిమాండ్‌‌ను తట్టుకుంటున్నప్పటికీ.. అసలు సంక్షోభం సాయంత్రం సూర్యాస్తమయంతోనే మొదలవుతున్నది. పగటిపూట పుష్కలంగా దొరికే సోలార్ ఉత్పత్తి సాయంత్రం 6 గంటలకల్లా ‘జీరో’కి చేరడం, అదే సమయంలో వ్యవసాయ లోడ్‌‌తోపాటు గృహ వినియోగం గరిష్ట స్థాయికి చేరడంతో ప్రతిరోజూ రాత్రి వేళ 13 వేల నుంచి 15 వేల మెగావాట్ల డిమాండ్ ఎదురవుతున్నది. రాష్ట్ర థర్మల్, కేంద్ర వాటా, హైడల్ ద్వారా గరిష్టంగా లభించేది 9,150 మెగావాట్లే కావడంతో ప్రతిరోజూ రాత్రి పూట నికరంగా 5 వేల నుంచి 5,500 మెగావాట్ల భారీ ‘కరెంట్ గ్యాప్’ ఏర్పడి.. సరఫరా వ్యవస్థలను కుదిపేస్తున్నది. నిరుడు పీక్ వేళల్లో  జలవిద్యుత్ అందుబాటులో ఉండడం కలిసివచ్చింది. కానీ ఈసారి శ్రీశైలం రిజర్వాయర్‌‌లో నీరు అడుగంటిపోవడం వల్ల హైడల్​ పవర్ ​ఆదుకోవడం లేదు . 

రాష్ట్రంలో ప్రస్తుతం హైడల్,  పంప్డ్ స్టోరేజ్ యూనిట్ల సామర్థ్యం 2,518 మెగావాట్లుగా ఉన్నది. కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవ ఉత్పత్తిని పరిశీలిస్తే.. ఈ నెల 9న ఆల్‌‌టైమ్ రికార్డు పీక్ సమయంలో హైడల్ విద్యుత్ ఉత్పత్తి ‘సున్నా’ గా రికార్డయింది.  గతేడాది శ్రీశైలం  డ్యాం నిండుకుండలా ఉండడంతో ఈ కేంద్రం చరిత్రలోనే రికార్డు స్థాయిలో 2,544.763 మిలియన్ యూనిట్ల విద్యుత్‌‌ను ఉత్పత్తి చేసి.. గ్రిడ్‌‌కు భారీ ఊరటనిచ్చింది. కానీ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఎగువ నుంచి ఇన్‌‌ఫ్లోలు నిలిచిపోవడం సమస్యగా మారింది.  విద్యుత్ లోటును అధిగమించడానికి సెప్టెంబర్ 16  నుంచి 28 వరకు కేవలం 12 రోజుల వ్యవధిలోనే ఏకంగా 21 టీఎంసీల నీటిని సాగర్​వైపు వదిలి, విద్యుదుత్పత్తికి వినియోగించారు. కానీ ప్రస్తుతం  నీళ్లు 854 అడుగులకు పడిపోవడం, ఇన్​ ఫ్లో లేకపోవడంతో హైడల్​పవర్​ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.