వైరల్ ఇన్ఫెక్షన్లతో పార్కిన్సన్స్ ముప్పు!.. సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి

వైరల్ ఇన్ఫెక్షన్లతో  పార్కిన్సన్స్ ముప్పు!.. సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి
  • ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ వైరస్‌‌‌‌‌‌‌‌ తో మెదడులో అసాధారణ గడ్డలు
  • అడ్డుకునేందుకు సహజ రక్షణ కవచంలా పోరాడుతున్న డీడీఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌39ఏ ప్రొటీన్
  • సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–సీసీఎంబీ పరిశోధనలో వెల్లడి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: సాధారణంగా వచ్చే ఫ్లూ (ఇన్ఫ్లుయెంజా), కరోనా వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు భవిష్యత్తులో మెదడు సంబంధిత వ్యాధులకు బీజం వేసే ప్రమాదం ఉందని తేలింది. ఇటువంటి ఇన్ఫెక్షన్ల వల్ల పార్కిన్సన్స్ వంటి న్యూరోడీజనరేటివ్ (నాడీ క్షీణత) జబ్బులు వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లోని సీఎస్ఐఆర్-సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) సైంటిస్టులు గుర్తించారు. 

ఆర్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ఏ రకానికి చెందిన వైరస్‌‌లు శరీరంలోకి ప్రవేశించినప్పుడు కణాల్లో జరిగే పరమాణు స్థాయి మార్పులపై సీసీఎంబీ పరిశోధకురాలు డాక్టర్ స్వస్తి రాయ్‌‌‌‌‌‌‌‌ చౌధరి ల్యాబ్ బృందం అధ్యయనం నిర్వహించి, ఈ కీలక విషయాలను వెల్లడించింది. అదే సమయంలో వైరస్ ప్రభావాన్ని అడ్డుకునేందుకు కణాల్లో సహజంగా పనిచేసే ఒక అణు రక్షణ వ్యవస్థను కూడా గుర్తించింది.

న్యూరాన్లను దెబ్బతీస్తున్న అసాధారణ గడ్డలు

నరాల క్షీణత సంబంధిత వ్యాధుల్లో మెదడు కణాల మధ్య అసాధారణంగా ప్రొటీన్ గడ్డలు (అమైలాయిడ్ డిపాజిట్లు) పేరుకుపోవడం ప్రధాన లక్షణం. పార్కిన్సన్స్ బారిన పడిన వారిలో ఆల్ఫా-సిన్యూక్లియిన్ అనే ప్రొటీన్ ఇలా గడ్డలుగా మారి న్యూరాన్ల మధ్య సమాచార ప్రసారానికి అడ్డంకిగా తయారవుతుంది. ఇన్ఫ్లుయెంజా, కరోనా వంటి ఆర్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ఏ వైరస్‌‌‌‌‌‌‌‌లు శరీరంలోకి చేరినప్పుడు వాటి జన్యు పదార్థం ఆర్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ఏ జీ-క్వాడ్రప్లెక్సెస్ అనే ప్రత్యేక త్రిమితీయ ఆకారాలుగా మడతపడుతుంది. ఈ ప్రత్యేక ఆర్‌‌‌‌‌‌‌‌జీ4 నిర్మాణాలు నేరుగా ఆల్ఫా-సిన్యూక్లియిన్ ప్రొటీన్‌‌తో బంధాన్ని ఏర్పరుచుకుని, అమైలాయిడ్ గడ్డలు మరింత వేగంగా ఏర్పడేలా ప్రేరేపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

ఎదురొడ్డి పోరాడుతున్న ‘డీడీఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌39ఏ’ ప్రొటీన్

అయితే వైరస్ దాడికి వ్యతిరేకంగా కణాల్లో ఒక అంతర్గత రక్షణ వ్యవస్థ కూడా పనిచేస్తుందని పరిశోధనలో తేలింది. ఇన్ఫెక్షన్ సోకిన వెంటనే సాధారణంగా కణకేంద్రకం (న్యూక్లియస్)లో ఉండే ‘డీడీఎక్స్ 39ఏ’ అనే హెలికేస్ ప్రొటీన్ సైటోప్లాజంలోకి విడుదలవుతుంది. ఇది ఆల్ఫా-సిన్యూక్లియిన్, వైరల్ ఆర్‌‌‌‌‌‌‌‌జీ4లతో కలిసి పనిచేస్తూ, వైరస్ తాలూకు ఆర్‌‌‌‌‌‌‌‌జీ4 నిర్మాణాలను విడదీస్తుంది. ఫలితంగా కణాల్లో వైరస్ పునరుత్పత్తి ప్రక్రియ దెబ్బతిని వైరల్ లోడ్ తగ్గడంతో పాటు ఆల్ఫా-సిన్యూక్లియిన్ అమైలాయిడ్ గడ్డలు ఏర్పడే వేగం కూడా నెమ్మదిస్తుందని పరిశోధకురాలు ఆంచల్ స్పష్టం చేశారు.

పదేపదే ఇన్ఫెక్షన్లు సోకితేనే ముప్పు..

కణాల్లోని జీవాణువుల మధ్య ఉండే సున్నితమైన సమతుల్యతపైనే ఈ రక్షణ ప్రక్రియ ఆధారపడి ఉంటుందని డాక్టర్ స్వస్తి రాయ్‌‌‌‌‌‌‌‌ చౌధరి తెలిపారు. కణాల్లో రక్షణ వ్యవస్థ ఉన్నప్పటికీ, కొన్ని పరిస్థితుల్లో వైరల్ చర్యల ప్రభావం పెరిగి అమైలాయిడ్ గడ్డలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన ప్రతి ఒక్కరికీ ఈ న్యూరోడీజనరేటివ్ వ్యాధులు వస్తాయని భావించాల్సిన అవసరం లేదని, అయితే పదేపదే వైరల్ ఇన్ఫెక్షన్లకు గురికావడం వల్ల కణాల సమతుల్యత దెబ్బతిని భవిష్యత్తులో పార్కిన్సన్స్ వంటి వ్యాధుల ముప్పు పెరిగే అవకాశం ఉందని ఆమె వివరించారు. ఒక సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ కొన్నేళ్ల తర్వాత మెదడు సంబంధిత వ్యాధులకు ఎలా పునాది వేస్తుందనే అంశంపై తమ ల్యాబ్‌‌‌‌‌‌‌‌ లో మరింత లోతైన పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలిపారు.