- 152 మీటర్ల నిర్మాణానికి అగ్రిమెంట్ చేయించాలి
- ఢిల్లీలో జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం విజ్ఞప్తి
- పాలమూరు, డిండి, సీతారామ, గౌరవెల్లికి పర్యావరణ అనుమతులు ఇప్పించాలి
- సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ పర్మిషన్ ఇవ్వాలి
- కృష్ణా నదిలో టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాలి
- పాటిల్‌తో భేటీలో మంత్రులు ఉత్తమ్, వివేక్, ఎంపీ వంశీ, ఎమ్మెల్యే వినోద్
న్యూఢిల్లీ, వెలుగు: తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి త్వరగా అనుమతులు ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర కోరిన సమాచారాన్ని ఇప్పటికే సమర్పించామని వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శక్తి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజీని ఎఫ్‌ఆర్‌ఎల్ +152 మీటర్ల స్థాయిలో నిర్మించేందుకు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య త్వరగా అంగీకారం కుదిరేలా చూడాలని కోరారు. ఆ స్థాయిలో బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ఆధారంగా నీటిని ఎల్లంపల్లికి తరలించేందుకు వీలుంటుందని వివరించారు. దీంతో నీటి తరలింపునకు అవసరమయ్యే విద్యుత్ వినియోగం, విద్యుత్ వ్యయం తగ్గుతుందని తెలిపారు.
పాలమూరు, సీతారామసాగర్‌కు పర్మిషన్ ఇవ్వండి
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐఎస్), డిండి ఎత్తిపోతల పథకం (డీఎల్‌ఐఎస్), సీతారామ సాగర్ బహుళార్థక ప్రాజెక్టు (ఎస్‌ఎస్‌ఎంపీ), గౌరవెల్లి రిజర్వాయర్లకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పర్యావరణ అనుమతులకు మార్గదర్శకాలను జారీ చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. ఆయా ప్రాజెక్టులకు వెంటనే పర్మిషన్ ఇవ్వాలని కోరారు. అనుమతుల జాప్యంతో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరుగుతోందని వివరించారు.
సమ్మక్క–సాగర్ ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇవ్వండి
సమ్మక్క–సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) వద్ద పెండింగ్‌లో ఉన్న అనుమతులను త్వరగా మంజూరు చేయాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి సమర్పించామని, నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట్ర అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి ఎన్‌వోసీ పొందేందుకు తాము చర్చిస్తున్నామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.
