మా భూములను కేసీఆర్  ఫాంహౌస్ లో కలిపేసుకున్నరు

మా భూములను కేసీఆర్  ఫాంహౌస్ లో కలిపేసుకున్నరు
  • పాత పాస్‌‌‌‌బుక్‌‌‌‌లు గుంజుకొని కొత్తవి ఇవ్వలేదు 
  • పాండురంగా రిజర్వాయర్ పరిహారమూ ఎగ్గొట్టిన్రు
  • పొంగులేటి ఎదుట శివారు వెంకటాపూర్ రైతుల ఆవేదన
  • నక్షా తీసి లెక్కతేలుస్తామన్న రెవెన్యూ మంత్రి  
  • ఇరు గ్రామాల సరిహద్దులపై విచారణకు ఆదేశం 

 

హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని 325 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌లో తమకు తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన 134 ఎకరాలను పక్కనే ఉన్న కేసీఆర్​ ఫాంహౌస్‌‌‌‌లో కలిపేసుకున్నారని శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతులు ఆరోపించారు. పాత పాస్‌‌‌‌బుక్కులు లాక్కొని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం  బాధితులంతా హైదరాబాద్‌‌‌‌లోని సెక్రటేరియెట్‌‌‌‌లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. తమ పాత పట్టాదారు పాస్‌‌‌‌బుక్కులు, గ్రామ నక్షలతో వచ్చి గోడు వెళ్లబోసుకున్నారు. సర్వే నంబర్లు 38, 41, 47, 85, 88, 100లోని భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులను పథకం ప్రకారమే మార్చివేశారని రైతులు ఆధారాలతో సహా వివరించారు. బాధిత రైతుల గోడు విన్న మంత్రి  పొంగులేటి.. గత ప్రభుత్వంలో ధరణి పేరిట జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయి ఎంక్వైరీ చేస్తామని హామీ ఇచ్చారు. పేద రైతుల భూములను బలవంతంగా లాక్కోవడమో, రికార్డులు మార్చి పెద్దల ఖాతాల్లో వేయడమో జరిగి ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.  

ధరణి రికార్డులు, గ్రామ నక్షలు, క్షేత్రస్థాయి సర్వే ఆధారంగా సమగ్ర విచారణ జరిపి అర్హులైన రైతులకు న్యాయం చేయాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ లోకేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్స్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతును ఆదేశించారు. శివారు వెంకటాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చట్టబద్ధంగా రైతుల ఆధీనంలో ఉన్న భూమిలో ఒక్క గుంట కూడా తప్పిపోకుండా రికార్డులను సరిదిద్ది, అర్హులకు  యాజమాన్య హక్కులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 

డిజిటల్‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌ పుస్తకాలు ఇస్తామని నమ్మబలికిన్రు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమకు జరిగిన అన్యాయాన్ని బాధితులు తుమ్మల సత్యనారాయణ, శేరి పోషయ్య, శ్రీకాంత్, పుట్ట విఠల్, దయానంద్, బచ్చలి జహంగీర్ తదితరులు మంత్రికి వివరించారు. నాడు డిజిటల్ పట్టాదారు పాస్‌‌‌‌‌‌‌‌పుస్తకాలు ఇస్తామని నమ్మబలికిన అధికారులు, తమ వద్ద ఉన్న పాత పాస్‌‌‌‌‌‌‌‌బుక్కులను స్వాధీనం చేసుకొని, ఆ తర్వాత కొత్త పుస్తకాలు ఇవ్వకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ అమల్లోకి రాగానే ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ రికార్డుల్లో పేర్లను పూర్తిగా తొలగించి, హక్కులను కాలరాశారన్నారు. ఫలితంగా దశాబ్దాలుగా దున్నుకుంటున్న భూములపై రైతులకు యాజమాన్య హక్కులు లేకుండా పోవడమే కాకుండా.. ప్రభుత్వం నుంచి వచ్చే రైతుబంధు, పంట రుణాలలాంటి సాయాలకు కూడా దూరమయ్యామని చెప్పారు.

పేద రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, అప్పటి ప్రభుత్వంలోని కొందరు అధికారులు, స్థానిక నేతలు కుమ్మక్కై రికార్డులనే గల్లంతు చేశారని బాధితులు మంత్రికి సమర్పించిన వినతిపత్రంలో  ప్రస్తావించారు. ఈ భూదందాలో  ‘ఓవర్ మ్యాపింగ్’  తెరపైకి వచ్చింది. శివారు వెంకటాపూర్ గ్రామ సరిహద్దులను అడ్డగోలుగా మార్చేసి, అక్కడి వ్యవసాయ భూములను నేరుగా ఎర్రవెల్లి గ్రామంలోని సర్వే నంబర్ 325లో విలీనం చేస్తూ నక్షలు సృష్టించారని రైతులు తెలిపారు. దీనికితోడు పాండురంగా రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా గ్రామ పరిధిలోని దేవాసుకుంట, ముత్తిలింగం కుంటలతోపాటు రైతుల పట్టా భూములు ముంపునకు గురైనా ఇప్పటివరకు పైసా పరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టారని కన్నీరు మున్నీరయ్యారు. రికార్డుల్లో భూములు లేకుండా చేసి, రిజర్వాయర్ ముంపు పరిహారాన్ని కూడా దక్కకుండా చేశారని రైతులు మండిపడ్డారు. ప్రస్తుతం ఎర్రవెల్లిలోని సర్వే నంబర్ 325లో ప్రభుత్వం ఎలాగైతే వివాదాల పరిష్కారానికి సమగ్ర సర్వే నిర్వహిస్తున్నదో.. అదే తరహాలో శివారు వెంకటాపూర్ గ్రామంలోనూ రీ-సర్వే చేపట్టి తమ హద్దులను  తేల్చాలని విన్నవించుకున్నారు.