Urvashi Rautela: నా పేరు, ఫొటోలు వాడుకున్నారు.. రూ.7 వేల కోట్లు కట్టాల్సిందే.. AI కంపెనీకి ఊర్వశి రౌతేలా నోటీసులు!

Urvashi Rautela: నా పేరు, ఫొటోలు వాడుకున్నారు.. రూ.7 వేల కోట్లు కట్టాల్సిందే.. AI కంపెనీకి ఊర్వశి రౌతేలా నోటీసులు!

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా పేరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తన పేరు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా ఉపయోగించారంటూ లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఓ ఏఐ కంపెనీపై ఊర్వశి టీమ్ లీగల్ యాక్షన్‌కు సిద్ధమైంది. ఈ వ్యవహారంలో రూ.7,000 కోట్ల నష్టపరిహారం కోరుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

అనుమతి లేకుండా పేరు, ఇమేజ్ వాడారంటూ..

ఊర్వశి రౌతేలా పేరు, ఇమేజ్, వీడియోలను తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించారని ఆమె టీమ్ ఆరోపించింది. తన అనుమతి లేకుండా ఎలాంటి వాణిజ్య ప్రయోజనాల కోసం తన గుర్తింపును ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. ఈ అంశంపై తగిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.

“లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఆ కంపెనీపై తగిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం రూ.7,000 కోట్ల నష్టపరిహారాన్ని కోరుతున్నాం. ఊర్వశి రౌతేలా పేరు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా ఉపయోగించడం ద్వారా ఆ సంస్థ వ్యాపారం బిలియన్ల డాలర్ల విలువను సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మీరు మీ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కంపెనీని నిర్మించుకోండి. మీ బ్రాండ్‌ను అభివృద్ధి చేసుకోండి. కానీ అనుమతి లేకుండా ఊర్వశి పేరును మీ వ్యాపారంలోకి మాత్రం లాగొద్దు” అని ఊర్వశి రౌతేలా టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 

ఊర్వశికి CEO కౌంటర్..

మరోవైపు 'బాలీవుడ్.AI' (Bollywood.AI), 'హాజికూడ్.AI' సంస్థల సీఈఓ షీరాజ్ హసన్ ఈ ఆరోపణలపై స్పందించారు. ఊర్వశి గతంలో తమ సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూను ప్రస్తావిస్తూ ఆమె వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌పై ఏఐ ప్రభావం గురించి ఊర్వశిని ప్రశ్నించగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల బాలీవుడ్ ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆమె చెప్పిన వీడియో వైరల్ అయింది. అయితే ఆమె చెప్పిన మాటలను తమ సంస్థ ఎలాంటి విధంగానూ ప్రభావితం చేయలేదని షీరాజ్ హసన్ పేర్కొన్నారు. 

‘‘ఉర్వశీ, ఆ మాటలు మేమేమీ నీ నోట్లో పెట్టలేదు. ఏఐ గురించి, భవిష్యత్తు ఎంటర్‌టైన్‌‌మెంట్ బిజినెస్ గురించి ఏవైనా సమాధానాలు ఇచ్చే ముందు కాస్త అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నాను. ఏఐ అంటే ఏంటో తెలుసుకో. నోటికి వచ్చినట్లు వాగకు. ఏఐ సినిమాలు, డిజిటల్ స్టార్స్, వయసు పెరగని వర్చువల్ నటులే భవిష్యత్తు. నీ సమాధానాన్ని నువ్వు వ్యతిరేకించవచ్చు కానీ, రాబోయే సాంకేతిక విప్లవాన్ని ఆపలేవు’’ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఏఐ సినిమాలు, డిజిటల్ స్టార్స్, వర్చువల్ క్యారెక్టర్లు భవిష్యత్తులో ఎంటర్‌టైన్‌మెంట్‌లో కీలకంగా మారతాయని ఆయన పేర్కొన్నారు.

అసలు వివాదం ఏంటి?

ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ సెలబ్రిటీల పేరు, ముఖం, గొంతు, వీడియోలను అనుమతి లేకుండా ఉపయోగించే అంశంపై వివాదాలు పెరుగుతున్నాయి. డీప్‌ఫేక్‌లు, వాయిస్ క్లోనింగ్, డిజిటల్ ట్విన్ వంటి టెక్నాలజీలతో సెలబ్రిటీల గుర్తింపును ఎలా రక్షించాలనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఊర్వశి రౌతేలా టీమ్ చేసిన రూ.7,000 కోట్ల నష్టపరిహారం క్లెయిమ్ ఇప్పుడు సినీ, టెక్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ క్లెయిమ్‌పై తుది న్యాయపరమైన నిర్ణయం రావాల్సి ఉంది.

టాలీవుడ్‌లోనూ ఊర్వశికి మంచి గుర్తింపు..

2013లో ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి.. మోడల్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ‘వాల్తేరు వీరయ్య’లో ‘బాస్ పార్టీ’, ‘ఏజెంట్’లో ‘వైల్డ్ సాలా’, ‘బ్రో’లో ‘మై డియర్ మార్కండేయ’, ‘డాకు మహారాజ్’లో ‘దబిడి దబిడి’ వంటి స్పెషల్ సాంగ్స్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుతం ఏఐ కంపెనీతో తలెత్తిన వివాదం, రూ.7,000 కోట్ల నష్టపరిహారం డిమాండ్, దానికి కంపెనీ సీఈఓ ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.