జెన్‌‌‌‌కో కేంద్రాలకు.. రోజుకు  75,500 టన్నుల బొగ్గు..ఎల్‌‌‌‌నినో నేపథ్యంలో పెరిగిన విద్యుత్ డిమాండ్

జెన్‌‌‌‌కో కేంద్రాలకు.. రోజుకు  75,500 టన్నుల బొగ్గు..ఎల్‌‌‌‌నినో నేపథ్యంలో పెరిగిన విద్యుత్ డిమాండ్
  •  ఎల్‌‌‌‌నినో నేపథ్యంలో పెరిగిన విద్యుత్ డిమాండ్​
  • ఇందుకు తగ్గట్టుగా బొగ్గు సరఫరా పెంపునకు కార్యాచరణ
  • పవర్ ప్లాంట్ల వారీగా బొగ్గు అవసరాలు, రవాణా సమస్యలపై సింగరేణి సీఎండీ డాక్టర్‌‌‌‌ బుద్ధ ప్రకాశ్ వీడియో కాన్ఫరెన్స్ 

హైదరాబాద్, వెలుగు : ఎల్‌‌నినో పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో విద్యుత్‌‌ అవసరాలు పెరుగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా జెన్ కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు 75,500 టన్నుల బొగ్గును సరఫరా చేయాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం సింగరేణి, తెలంగాణ జెన్‌‌కో సంస్థలు కార్యాచరణ రూపొందించాయి. ఈ మేరకు మంగళవారం సాయంత్రం సింగరేణి, జెన్ కో ఆఫీసర్లు వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు. సింగరేణి సీఎండీ డాక్టర్‌‌ బుద్ధ ప్రకాశ్ జ్యోతి, తెలంగాణ జెన్‌‌కో సీఎండీ డాక్టర్‌‌ హరీశ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సింగరేణి ఏరియా జనరల్‌‌ మేనేజర్లు, జెన్‌‌కో విద్యుత్‌‌ కేంద్రాల చీఫ్‌‌ ఇంజినీర్లు, ఇరు సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్‌‌ కేంద్రాల వారీగా బొగ్గు అవసరాలు, ప్రస్తుతం జరుగుతున్న సరఫరా, బొగ్గు నాణ్యత, రైల్వే రేకుల అందుబాటు, లోడింగ్‌‌, అన్‌‌లోడింగ్‌‌, రవాణాలో ఎదురవుతున్న ఇబ్బందులపై సమీక్ష జరిపారు.

రైలు మార్గంలో 56 వేల టన్నులు

సింగరేణి నుంచి రోజుకు 14 రైల్వే రేకుల ద్వారా 56 వేల టన్నులు, రోడ్డు మార్గంలో మరో 19,500 టన్నుల బొగ్గు సరఫరా చేసే ప్రణాళికపై సమావేశంలో చర్చించారు. కొత్తగూడెం విద్యుత్‌‌ కేంద్రానికి రోజుకు 24 వేల టన్నులు, కాకతీయకు 4,500 టన్నులు, భద్రాద్రికి 15 వేల టన్నులు, యాదాద్రికి 34 వేల టన్నుల బొగ్గు అవసరాలపై కేంద్రాల వారీగా రివ్యూ జరిపారు. యాదాద్రికి సరఫరా కోసం ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌‌ నుంచి రెండు రేకుల ద్వారా రోజుకు 8 వేల టన్నులు, స్థానిక సింగరేణి గనుల నుంచి ఆరు రేకుల ద్వారా 36 వేల టన్నులు రవాణా చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. నైనీ నుంచి సరఫరా పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు సింగరేణి అధికారులు తెలిపారు.
 
గతేడాదితో పోలిస్తే 31 శాతం పెరుగుదల

ఈ నెలలో 28వ తేదీ నాటికి జెన్‌‌కో విద్యుత్‌‌ కేంద్రాలకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా మొత్తం 15.02 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేసినట్లు సింగరేణి మార్కెటింగ్‌‌ శాఖ అధికారులు వెల్లడించారు. గతేడాది సెప్టెంబరులో ఇదే సమయంలో 11.44 లక్షల టన్నులు మాత్రమే సరఫరా కాగా, ఈ సారి 3.58 లక్షల టన్నులు, అంటే 31 శాతం సరఫరా పెరిగిందని వివరించారు. ఎల్‌‌నినో నేపథ్యంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులతో విద్యుత్‌‌ డిమాండ్‌‌ పెరిగిందని, ఉత్పత్తికి అనుగుణంగా మరింత బొగ్గు అవసరమని జెన్‌‌కో అధికారులు తెలిపారు. బొగ్గు సరఫరా, రవాణా, స్వీకరణలో ఎదురయ్యే సమస్యలను సంబంధిత ఏరియా జీఎంలు, విద్యుత్‌‌ కేంద్రాల సీఈలు పరస్పర సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని సూచించారు. రేకుల సమీకరణతో పాటు లోడింగ్‌‌, అన్‌‌లోడింగ్‌‌ ప్రక్రియలను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో సింగరేణి డైరెక్టర్లు ఎల్ వీ. సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, జీఎం టి.శ్రీనివాస్‌‌, జెన్‌‌కో విద్యుత్‌‌ కేంద్రాల చీఫ్‌‌ ఇంజినీర్లు, సింగరేణి ఏరియా జనరల్‌‌ మేనేజర్లు పాల్గొన్నారు.