- హిందూ సమాజాన్ని విడదీసేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
- వెంటనే సీఎం హిందువులకు క్షమాపణ చెప్పాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సీఎం రేవంత్ రెడ్డి.. రాముడు, శివుడి మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడి హిందూ సమాజాన్ని నిలువునా విడదీసే కుట్రలకు తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ వెంటనే హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్, అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘శివుడు పేదల దేవుడు.. రాముడు ధనవంతుల దేవుడు’ అంటూ సీఎం స్థాయి వ్యక్తి అత్యంత అభ్యంతరకరంగా మాట్లాడడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. హిందూ దేవుళ్ల మధ్య వైషమ్యాలు రగిలించడం సరికాదన్నారు. హిందూ దేవుళ్లను కించపరిచి, సమాజంలో చిచ్చుపెట్టాలని చూస్తున్న సీఎం రేవంత్ తీరును నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు ఆయన ప్రకటించారు.
రాజ్యాంగ సంస్థలపై విష ప్రచారం..
భారత్ ఎన్నికల ప్రక్రియను ట్రంప్ వంటి నేతలు ప్రశంసిస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం ఎన్నికల వ్యవస్థను, ప్రతిష్టను ప్రపంచ వేదికలపై కించపరుస్తోందని రాంచందర్‌రావు విమర్శించారు. దేశవ్యాప్తంగా చేపట్టిన సర్ ప్రక్రియపై కాంగ్రెస్, ఇండి కూటమి కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు గెలుస్తం
రాష్ట్రంలో త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్, వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో పార్టీ ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా సరే.. కార్యకర్తలందరూ ఏకతాటిపై నిలిచి గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
