వెలుగు స్పెషల్: సీఎం రేవంత్ రాక.. కరీంనగర్–సిరిసిల్లకు మహర్దశ కావాలె

వెలుగు స్పెషల్:  సీఎం రేవంత్ రాక.. కరీంనగర్–సిరిసిల్లకు మహర్దశ కావాలె

ముఖ్యమంత్రి  రేవంత్‌‌రెడ్డి రాకకోసం కరీంనగర్‌‌ – సిరిసిల్ల ప్రజలు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు.   ఇయ్యాల సీఎం రేవంత్‌‌ రెడ్డి కరీంనగర్‌‌,  సిరిసిల్లలో  పర్యటించనున్న నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, సిరిసిల్ల నేతన్నకు శాశ్వత భరోసా లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. కరీంనగర్‌‌లో నూతన సమీకృత కలెక్టరేట్‌‌ ప్రారంభం, సిరిసిల్లలో  భారీ బహిరంగ సభతో  సీఎం పర్యటన సాగనుంది.  తెలంగాణను ప్రపంచస్థాయి అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనే దూరదృష్టితో ఫ్యూచర్‌‌ సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు రేవంత్‌‌రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అదే స్ఫూర్తితో ఉత్తర తెలంగాణకు కీలకమైన కరీంనగర్‌‌–సిరిసిల్ల ప్రాంతాలను కూడా అభివృద్ధిలో అగ్రభాగాన నిలపాల్సిన అవసరం ఉంది.  

కరీంనగర్‌‌ను వాణిజ్యం, విద్య, వైద్యం, పర్యాటకం, లాజిస్టిక్స్‌‌ కేంద్రంగా.. సిరిసిల్లను ప్రపంచస్థాయి వస్త్ర పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దేలా దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. రైల్వే అనుసంధానం, జాతీయ రహదారులు, రింగ్‌‌రోడ్డు, పరిశ్రమలు, పర్యాటకం, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో రెండు ప్రాంతాలను అనుసంధానిస్తే ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కొత్త బలం చేకూరుతుంది. సిరిసిల్ల అంటే నేతన్న బతుకు. మగ్గం చుట్టూ వేలాది కుటుంబాల జీవితం తిరుగుతోంది. తరతరాలుగా చేనేత,  పవర్‌‌లూమ్‌‌ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులకు సంక్షేమంతోపాటు నిరంతర ఉపాధి, గిట్టుబాటు ఆదాయం, ఆధునిక సాంకేతికత, ప్రపంచ మార్కెట్‌‌ అందుబాటులోకి రావాలి.


నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత

కాంగ్రెస్‌‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నల సంక్షేమానికి  పెండింగ్‌‌లో ఉన్న రూ.352.35 కోట్ల బకాయిలను చెల్లించడంతోపాటు రూ.50 కోట్ల కార్పస్‌‌ నిధులతో వేములవాడలో యార్న్‌‌ డిపో ఏర్పాటు చేసి 2,478 మెట్రిక్‌‌ టన్నుల నూలును రూ.65.94 కోట్ల విలువతో సరఫరా చేసింది. 2025–26లో 6.87 కోట్ల మీటర్ల ఇందిరమ్మ చీరల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లతో సుమారు ఎనిమిది నెలల పాటు పని లభించగా.. 2026–27 తొలి విడతలో మరో 3.01 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇచ్చారు. దాదాపు 100 కోట్ల ప్రాజెక్టును అప్పగించారు. థ్రిఫ్ట్‌‌ ఫండ్‌‌లో 4,963 మందికి రూ.12.41 కోట్లు విడుదల చేయడంతోపాటు 5,534 మంది కొత్తగా నమోదయ్యారు. నేతన్న బీమా కింద 5,926 మంది నమోదవగా.. 132 కుటుంబాలకు రూ.6.60 కోట్ల సాయం అందింది. 25 హెచ్‌‌పీ వరకు పవర్‌‌లూమ్‌‌ యూనిట్లకు 50 శాతం విద్యుత్‌‌ టారిఫ్‌‌ సబ్సిడీతో సుమారు 2,000 యూనిట్లకు ప్రయోజనం కలుగుతోంది. ఇవియేకాక ఉపాధికి నిరంతర ఆర్డర్లు,  ముడిసరుకు నూలు,  కుటుంబానికి బీమా,  భవిష్యత్తుకు పొదుపు అనే భరోసా మరింత బలపడేలా ప్రభుత్వం ముందుకుసాగాలి.  ఆధునిక మగ్గాలు, యంత్రాలు, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తే సుమారు 1,200 మంది నేత కార్మికులకు ప్రత్యక్ష ఉపాధి కల్పించే అవకాశం ఉంది. అదే సమయంలో డయింగ్‌‌, ప్రాసెసింగ్‌‌, ఫినిషింగ్‌‌ యూనిట్లు ఏర్పాటు చేస్తే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మరింత మహర్దశ వస్తుంది. 

జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌‌కు ‘సిరిసిల్ల బ్రాండ్‌‌’

పోచంపల్లి, వారణాసి, కాంచీపురం, సంబల్పూర్‌‌ వంటి చేనేత కేంద్రాలు తమ ప్రత్యేక ఉత్పత్తులు, డిజైన్లు, బ్రాండింగ్‌‌, మార్కెటింగ్‌‌ వ్యవస్థలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. అదే తరహాలో సిరిసిల్లకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి.  ‘సిరిసిల్ల బ్రాండ్‌‌’ను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌‌కు తీసుకెళ్లేలా నాణ్యత ధ్రువీకరణ, ఆధునిక డిజైన్‌‌ కేంద్రాలు, శిక్షణ, ఆకర్షణీయ ప్యాకేజింగ్‌‌, ఈ–కామర్స్‌‌ మార్కెటింగ్‌‌, దేశీయ–అంతర్జాతీయ ఎగ్జిబిషన్లలో 
ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయాలి. సిరిసిల్లలో తయారయ్యే వస్త్రాలకు మార్కెట్‌‌ లభించేలా ప్రభుత్వ కొనుగోళ్లతోపాటు దేశీయ, అంతర్జాతీయ మార్కెటింగ్‌‌ వ్యవస్థను బలోపేతం చేయాలి. కరీంనగర్‌‌లో అత్యంత కీలకమైన ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని మరింత ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. సమగ్ర స్టార్మ్‌‌ వాటర్‌‌ డ్రైనేజీ వ్యవస్థ, ప్రధాన మురుగు కాల్వల ఆధునికీకరణ, నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణ చేపట్టాలి. వర్షాలను దృష్టిలో పెట్టుకుని శాశ్వత పరిష్కారం చూపేలా ప్రత్యేక నిధులు కేటాయించాలని  ముఖ్యమంత్రిని  కోరుతున్నాను. 

విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతివ్వాలి

కరీంనగర్‌‌ సిల్వర్‌‌ ఫిలిగ్రీకి ప్రత్యేకమైన అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఈ సంప్రదాయ కళను ఆధునిక డిజైన్లు, శిక్షణ, బ్రాండింగ్‌‌, ఈ–కామర్స్‌‌, ఎగుమతులతో అనుసంధానం చేయాలి. కళాకారుల ఉత్పత్తులకు దేశీయ,  అంతర్జాతీయ ప్రదర్శనల్లో ప్రత్యేక మార్కెటింగ్‌‌ వేదికలు కల్పించాలి. నగరంతోపాటు నియోజకవర్గ పరిధిలోని పేద,  మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కరీంనగర్‌‌కు ఇంటిగ్రేటెడ్‌‌ స్కూల్‌‌, తెలంగాణ పబ్లిక్‌‌ స్కూల్‌‌ను మంజూరు చేయాలి. ఆధునిక వసతులు, నాణ్యమైన విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చేలా వీటిని ఏర్పాటు చేస్తే కరీంనగర్‌‌ను విద్యా కేంద్రంగా మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. కరీంనగర్‌‌లో అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌‌ స్టేడియం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.  క్రీడా అకాడమీ, ప్రాక్టీస్‌‌ పిచ్‌‌లు, ఇండోర్‌‌ సదుపాయాలు, ఫిట్‌‌నెస్‌‌ కేంద్రాలతో సమగ్ర క్రీడా సముదాయంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. కరీంనగర్‌‌–సిరిసిల్ల ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించాలి. గ్రానైట్‌‌ రంగంలో ముడి ఉత్పత్తులకే  పరిమితం కాకుండా విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ యూనిట్లను ప్రోత్సహించాలి. సిరిసిల్లలో టెక్స్ టైల్‌‌ పరిశ్రమ విస్తరణకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించాలి.

కరీంనగర్‌‌-సిరిసిల్ల  కొత్త అధ్యాయానికి నాంది

 కరీంనగర్‌‌లో అంతర్జాతీయ స్థాయి ఎగ్జిబిషన్‌‌, కన్వెన్షన్‌‌ సెంటర్‌‌ ఏర్పాటు చేస్తే వాణిజ్య, పారిశ్రామిక, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలకు కొత్త వేదిక ఏర్పడుతుంది. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి భారీ స్థాయి జాబ్‌‌మేళా నిర్వహించేలా శాశ్వత వ్యవస్థ ఏర్పాటు చేయాలి.  ప్రతి ఏడాది గ్రాడ్యుయేట్‌‌ కాంక్లేవ్‌‌ నిర్వహించి పరిశ్రమలు–విద్యాసంస్థల మధ్య అనుసంధానాన్ని పెంచాలి. కరీంనగర్‌‌ నగరం, నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభా, పేద కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని   భవిష్యత్‌‌ అవసరాలకు సరిపడేలా తాగునీటి మౌలిక వసతులను రూపొందించాలి. కరీంనగర్‌‌లో 
ప్రతిపాదిత టీటీడీ ఆలయ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలి. కరీంనగర్‌‌ను వాణిజ్యం, విద్య, వైద్యం, పర్యాటకం, లాజిస్టిక్స్‌‌ కేంద్రంగా.. సిరిసిల్లను వస్త్ర పరిశ్రమల ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తూ రెండు ప్రాంతాలను రహదారులు, రైల్వే, పరిశ్రమలు, పర్యాటకం, విద్య, ఉపాధి రంగాల్లో అనుసంధానించే 
ప్రణాళిక రూపొందించాలి. తెలంగాణను ప్రపంచస్థాయి అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నవేళ.. కరీంనగర్‌‌–సిరిసిల్ల ప్రాంతాలకు కూడా అదే దూరదృష్టితో ప్రత్యేక అభివృద్ధి కార్యాచరణ రూపొందించాలి.  సీఎం రేవంత్ పర్యటన కరీంనగర్‌‌–సిరిసిల్ల అభివృద్ధికి కొత్త అధ్యాయానికి నాంది పలికేలా ఉండాలని భావిస్తున్నాం. 

కరీంనగర్‌‌‌‌ను సమగ్ర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి

కరీంనగర్‌‌  రింగ్‌‌రోడ్డు ఏర్పాటుతో నగర ట్రాఫిక్‌‌పై ఒత్తిడి తగ్గడంతోపాటు కొత్త వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది. మనోహరాబాద్‌‌–కొత్తపల్లి రైల్వే లైన్‌‌ కరీంనగర్‌‌ ప్రాంత అభివృద్ధికి అత్యంత కీలకం. ప్రాజెక్టులో  మిగిలిన పనులను వేగవంతం చేయడం అవసరం. కరీంనగర్‌‌కు ప్రకృతి ఇచ్చిన గొప్ప వనరుల్లో మానేరు నది, లోయర్‌‌ మానేరు డ్యామ్‌‌ ఒకటి. మానేరు రివర్‌‌ఫ్రంట్‌‌ పనులను సత్వరమే పూర్తి చేసి నడక మార్గాలు, పచ్చదనం, వెలుగుల అలంకరణ, కుటుంబ వినోద వసతులు, స్థానిక కళలు, ఆహార కేంద్రాలతో పీపీటీ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేయాలి. ఎల్‌‌ఎండీని బోటింగ్‌‌, వాటర్‌‌ స్పోర్ట్స్‌‌, పిల్లల వినోద కేంద్రాలు, 
వ్యూ పాయింట్లు, పార్కులతో సమగ్ర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. రిజర్వాయర్‌‌ రెండు కొండల మధ్య డాక్టర్‌‌ బీఆర్‌‌ అంబేద్కర్‌‌ విగ్రహం ఏర్పాటు చేయాలి.  ఉజ్వల పార్కు, మానేరు రివర్‌‌ఫ్రంట్‌‌, కేబుల్‌‌ బ్రిడ్జి, కమాన్‌‌ ప్రాంతం, టవర్‌‌ సర్కిల్‌‌ ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తే కరీంనగర్‌‌కు ప్రత్యేక పర్యాటక ముఖచిత్రం ఏర్పడుతుంది.


 
-  వెలిచాల రాజేందర్‌‌రావు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు