జనగణనలో కులగణన చేపట్టాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా చాలాకాలంగా ఉంది. కులాలవారీగా జనాభా, సామాజిక స్థితిగతులు, విద్య, ఉపాధి, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమాచారం అవసరమనే ఉద్దేశంతో ఈ డిమాండ్ ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 30న, 2027లో నిర్వహించే జనగణనలో కులగణన చేపట్టాలని నిర్ణయించింది. 2026 ఫిబ్రవరిలో కులాలను రెండో దశ జనాభా గణనలో లెక్కిస్తామని పార్లమెంటుకు తెలిపింది. ఆ తర్వాత రెండో దశ ప్రశ్నావళిని కూడా నోటిఫై చేసింది. ఇప్పుడు సబ్‌కాస్ట్ వారీగా వివరాలు నమోదు చేయాలనే డిమాండ్ ముందుకు వస్తోంది. ఈ డిమాండ్ సరైనదే అయినప్పటికీ ఆ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెడదాం.
అసలు ప్రశ్న ఏమిటంటే, సబ్‌కాస్ట్ సమాచారం అవసరమని భావించిన రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాలు, మేధావులు ఈ డిమాండ్‌ను నిర్ణయం తీసుకునేముందు, ప్రశ్నావళి ఖరారుచేసే ముందు ఎందుకు బలమైన రాజకీయ ప్రతిపాదనగా ముందుకు తీసుకురాలేకపోయారు?ప్రభుత్వ విధానం ఒక్కరోజులో తయారవదు. నిర్ణయం తీసుకునేముందు అనేక దశల్లో చర్చలు జరుగుతాయి. శాఖల అభిప్రాయాలు, నిపుణుల సూచనలు, పరిపాలనా సాధ్యత, అవసరమైన సమాచార సేకరణ వంటి అంశాలను పరిశీలిస్తారు. ఆ తర్వాతే విధివిధానాలు, ప్రశ్నావళి రూపొందుతాయి. జనగణన ప్రశ్నావళి తయారీలో వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు, జనగణన సమాచార వినియోగదారుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్రం పార్లమెంటులోనే తెలిపింది. అంటే ప్రజా డిమాండ్లకు నిర్ణయప్రక్రియలో స్థానం ఉండే అవకాశం ముందుగానే ఉంది. అలాంటప్పుడు సబ్‌కాస్ట్ వంటి ముఖ్యమైన అంశం నిర్ణయం వెలువడిన తర్వాత కాకుండా, విధానం రూపుదిద్దుకునే సమయంలోనే అధికారిక ప్రతిపాదనగా ప్రభుత్వం ముందుకు వెళ్లాలి. మరి అదే ఎందుకు ముందుకు వెళ్లలేదు?
చివరి దశలో డిమాండ్ వల్ల ప్రభావం పరిమితం
ఇదే విషయాన్ని బడ్జెట్ ఉదాహరణతో సులభంగా అర్థం చేసుకోవచ్చు. బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టే రోజుకు మూడు నాలుగు నెలల ముందే శాఖల అవసరాలు, ప్రతిపాదనలు, కేటాయింపులపై కసరత్తు జరుగుతుంది. ఒక సామాజిక సంఘం తన వర్గానికి అవసరమైన నిధులు, కార్యక్రమాలు, గణాంకాలతో ముందుగానే ప్రభుత్వాన్ని సంప్రదిస్తే ఆ ప్రతిపాదన బడ్జెట్ రూపకల్పనలో పరిశీలనకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ బడ్జెట్‌ను రేపు ప్రవేశపెడుతున్నారని తెలిసి ఈరోజు ముఖ్యమంత్రిని కలిసి ‘మాకు ఇంత కేటాయించాలి’ అని కోరితే.. అది ప్రజా సమస్యను వ్యక్తం చేయడమే అయినా, నిర్ణయాన్ని ప్రభావితం చేసే కీలక సమయం అప్పటికే దాదాపు దాటిపోయి ఉంటుంది. జనగణన విషయంలోనూ ఇదే ప్రశ్న. నిర్ణయం, విధానం, ప్రశ్నావళి రూపుదిద్దుకునే సమయంలో జోక్యం చేసుకోవాల్సినచోట, చివరి దశలో డిమాండ్‌ను తీవ్రతరం చేయడం వల్ల ప్రభావం పరిమితమవుతుంది.
ప్రజాబలంతో రాజకీయ పోరాటం
రాజకీయ ఒత్తిడి కేవలం ఒక వ్యూహాత్మక సూచన మాత్రమే కాదు - ఇది మనం ఎదుర్కొంటున్న రాజ్యవ్యవస్థ స్వభావం నుంచి పుట్టిన అవసరం. కేంద్రంలో లేదా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ వంటి పార్టీలు నడిపే బ్రాహ్మణ భావజాల ఆధిపత్య రాజ్యవ్యవస్థ కింది కులాల హక్కులను దానంతట అదే గుర్తించదు. పోరాడితేనే, ఒత్తిడి తెస్తేనే వెనక్కి తగ్గుతుంది. పట్టించుకోకుండా ఉండటమే దాని సహజ ధోరణి. కేవలం సకాలంలో ప్రతిపాదన ఇవ్వడం మాత్రమే సరిపోదు. ఆ వ్యవస్థను వెనక్కి తగ్గించేంత బలమైన రాజకీయ అనిశ్చితిని కల్పించడం కూడా అంతే అవసరం. నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితిని ప్రజాబలంతో సృష్టించడం అసలు రాజకీయ పోరాటం.
ఉద్యమాలు రాజకీయ శక్తిగా మారాలి
సబ్‌కాస్ట్ వారీగా సమాచారం కోరడం కూడా అదే హక్కులో భాగం. కానీ నిర్ణయం తర్వాత చేసే ఆందోళనకు, నిర్ణయం ముందు చేసే రాజకీయ జోక్యానికి మధ్య తేడా ఉంది. ఒకటి ఇప్పటికే తీసుకున్న నిర్ణయంలో మార్పు కోరితే, మరొకటి నిర్ణయం రూపుదిద్దుకునే సమయంలోనే ప్రజల డిమాండ్‌ను అందులోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ముందస్తు ప్రణాళిక, నిరంతర రాజకీయ ఒత్తిడి, ప్రజాబలం లేకుండా చివరి దశలో మాత్రమే స్పందిస్తే ఉద్యమం తన పూర్తి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఉద్యమాలు కేవలం కార్యక్రమాలుగా కాకుండా, ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితంచేసే ప్రజా బలంగా, రాజకీయ శక్తిగా రూపాంతరం చెందాలి. కాబట్టి ఈరోజు మనం అడగాల్సిన ప్రశ్న ‘సబ్‌కాస్ట్ కాలమ్ ఎందుకు పెట్టలేదు?’ అనే ప్రశ్నతో మాత్రమే ఆగకూడదు. ‘సబ్‌కాస్ట్ సమాచారం అవసరమని భావించినవారు, ఆ అవసరాన్ని నిర్ణయం తీసుకునే దశలో ఎంత బలంగా రాజకీయ డిమాండ్‌గా ముందుకు తీసుకెళ్లారు?’ అనేదే అసలు ప్రశ్న. ప్రజాస్వామ్యంలో గొంతు వినిపించడం మాత్రమే కాదు, ఆ గొంతు నిర్ణయం తీసుకునే సమయానికి వినిపించేలా చేయడం, పాలకులు నిర్ణయం మార్చక తప్పని స్థాయిలో ప్రజాబలాన్ని నిర్మించడం - ఇదే రాజకీయ దూరదృష్టి,
ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చేంత ఒత్తిడి అవసరం
పార్లమెంటులో ఉన్న ప్రజాప్రతినిధులు ఈ అంశాన్ని ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్లారు? రాజకీయ పార్టీలు తమ అధికారిక వేదికలపై ఏ ప్రతిపాదనలు చేశాయి? రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి ఏమి తెలియజేశాయి? సామాజిక సంఘాలు, మేధావులు సమగ్ర ప్రతిపాదనలతో ఎంతవరకు జోక్యం చేసుకున్నారు? ఇప్పటికే ఎవరు ఏ ప్రయత్నాలు చేశారో కూడా వాస్తవాల ఆధారంగా పరిశీలించాలి. అయితే ఆ ప్రయత్నాలు ఎంత సమన్వయంతో, ఏ సమయానికి జరిగాయన్నదే కీలకం. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయం వెలువడిన తర్వాత స్పందించడం కంటే, నిర్ణయం రూపుదిద్దుకునే సమయంలోనే ప్రజా డిమాండ్‌ను విధాన ప్రక్రియలోకి తీసుకెళ్లడం ఎక్కువ ప్రభావవంతమైన మార్గం. అయితే ముందస్తుగా ప్రతిపాదన ఇవ్వడం ఒక్కటే సరిపోదు. ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చేంత రాజకీయ ఒత్తిడి కూడా అవసరం. చివరి నిమిషపు ప్రతినిధి బృందాలు ప్రభుత్వ నిర్ణయంపై గణనీయమైన ప్రభావం చూపలేని కార్యక్రమాలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.
- పాపని నాగరాజు
సోషల్ ఎనలిస్ట్
