- హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌కు రామ్మోహన్ రెడ్డి
- నల్గొండ, ఖమ్మం, వరంగల్‌కు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల కోసం రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానం అభ్యర్థిగా సామ రామ్మోహన్‌రెడ్డి.. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని అభ్యర్థులుగా ఎంపిక చేసింది. ఈ మేరకు మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ రెండు స్థానాలకు పలువురు ఆశావహుల పేర్లను పీసీసీ పరిశీలించి, అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ అధిష్టానానికి పంపించింది. తాజా నిర్ణయంతో రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎన్నికల కసరత్తు అధికారికంగా ముందుకు సాగనున్నది.
ఇండస్ట్రియలిస్ట్ నుంచి రాజకీయ నేతగా సర్వోత్తమ్..
ఖమ్మం– నల్గొండ–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఏఐసీసీ, పీసీసీ సభ్యుడు, వ్యాపారవేత్త , రైతు. ఈయన 2012 నుంచి కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో పార్టీకి కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. పార్టీతో సుదీర్ఘ అనుబంధం కలిగిన నాలుగు తరాల కాంగ్రెస్ కుటుంబానికి చెందినవారు. ఈయన తండ్రి దివంగత కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీలో బీఈ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్) చేశారు. థండర్‌బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ(అమెరికా) నుంచి ఎంబీఏ, ఎంఐఎం పూర్తి చేశారు. బీఈ, ఎంబీఏలో గోల్డ్ మెడల్స్ సాధించారు. బిజినెస్ అనాలిసిస్, క్రెడిట్ రిస్క్, మార్కెటింగ్, ఆపరేషన్స్ విభాగాలలో బాధ్యతాయుతమైన పదవులను నిర్వహించారు. అమెరికా, కెనడా, యూకేతోపాటు భారత్‌లో వృత్తిపరమైన అనుభవం గడించారు. వ్యవసాయం, హాల్టికల్చర్, ఆక్వాకల్చర్, పాడి పరిశ్రమలలో చురుకైన భాగస్వామిగా ఉన్నారు. వీటితో పాటు సోలార్ ఎనర్జీ, డిజిల్ జెనరేటర్లు, ఎలక్ట్రికల్ పరికరాలు, హాస్పిటాలిటీ (ఆతిథ్య రంగం), కమర్షియల్ రెంటల్స్, నిర్మాణ సామగ్రి రంగాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
ఎన్‌ఎస్‌యూఐ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన సామ.
సామ రామ్మోహన్ రెడ్డి 2003లో ఎన్‌ఎస్‌యూఐ ద్వారా కాంగ్రెస్ పార్టీలో ప్రస్థానం ప్రారంభించారు. బీటెక్ , ఎల్‌ఎల్‌బీ విద్యార్హతలతో హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయన, గతంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) జనరల్ సెక్రటరీగా, ఇండియన్ యూత్ కాంగ్రెస్ తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. అలాగే 2017లో రాష్ట్ర లీగల్ సెల్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 నుంచి పీసీసీ అధికార ప్రతినిధిగా సేవలందిస్తూ, 2024లో టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్‌గా నియమితులయ్యారు. 2,500కు పైగా ప్రైమ్ టైమ్ టీవీ చర్చల్లో పార్టీ వాణిని బలంగా వినిపించడంతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయి పోరాటాలు చేశారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల వార్ రూమ్‌లు, వ్యూహాత్మక మీడియా ప్రచారాలు, గాంధీ భవన్ సమన్వయకర్తగా పార్టీ విజయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు.
