పసిడి కొనుగోలుదారులకు ఊరట.. దిగొస్తున్న బంగారం ధరలు

పసిడి కొనుగోలుదారులకు ఊరట.. దిగొస్తున్న బంగారం ధరలు
  • తులం గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వారంలో 7,040 దాకా తగ్గుదల 
  • మంగళవారం ఒక్కరోజే రూ.1,480 పతనం  
  • బంగారం బాటలోనే వెండి   
  • రూ.3,900 వరకు తగ్గిన సిల్వర్   

హైదరాబాద్, వెలుగు:బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం వరుసగా మూడో రోజూ బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పసిడి ధరలు దిగిరావడంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముడిచమురు ధరల పెరుగుదల, అమెరికా డాలర్ విలువ పసిడి మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. 

తాజాగా బంగారం ధరలో ఒక్కరోజులోనే రూ.1,480 మేర తగ్గుదల నమోదైంది. వెండి ధర కూడా దాదాపు రూ.3,900 మేర పడిపోయింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సోమవారం 24 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర రూ.1,53,200గా ఉండగా.. మంగళవారం నాటికి ఇది రూ.1,480 మేర పతనమై రూ.1,51,720కి తగ్గింది. ఆభరణాల తయారీలో సాధారణంగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర రూ.1,36,400కి దిగొచ్చింది.  

నిజానికి ఈ నెల 20న 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,850 ఉండగా.. 29 నాటికి రూ.1,36,400కు అంటే ఏకంగా రూ. 6,450 తగ్గింది. అలాగే 20వ తేదీన 24 క్యారెట్ల ధర రూ.1,55,840 ఉండగా, మంగళవారం రూ. 1,48,800 కు పడిపోయింది. అంటే రూ.7,040 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 4,137 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వరంగల్, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లో పది గ్రాముల బంగారం 24 క్యారెట్లు రూ.1,48,800, 22 క్యారెట్లు రూ.1,36,400, 17 క్యారెట్లు రూ.1,11,600 పలికింది.  

కొనేటప్పుడు ఇవి చూడాల్సిందే.. 

బంగారం కొనేటప్పుడు వినియోగదారులు కేవలం పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేదా టీవీల్లో చూసే గ్రాము ధరనే ప్రామాణికంగా భావిస్తారు. కానీ షాపులోకి వెళ్లి నగలు కొనేటప్పుడు బిల్లు మరింత ఎక్కువగా వస్తుంది. తుది బిల్లు ఎలా మారుతుందో తెలుసుకోవడం చాలా అవసరం. ఎంచుకున్న 22 క్యారెట్లు లేదా 18 క్యారెట్ల బంగారం బరువుకు సంబంధించిన మూల ధర, ఆభరణం డిజైన్, పనితనాన్ని బట్టి వ్యాపారులు 5 శాతం నుంచి 25 శాతం లేదా అంతకంటే ఎక్కువ మేకింగ్ చార్జీలను కలుపుతారు. బంగారం మూల ధర, మేకింగ్ చార్జీల మొత్తం విలువపై 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అందువల్ల బంగారం ధర తగ్గింది కదా అని వెంటనే కొనేయకుండా.. నగ బరువు, మేకింగ్ చార్జీలు, తరుగు, పన్నులు అన్నీ కలిపిన తర్వాత తుది బిల్లు ఎంతవుతుందో  తెలుసుకోవడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. డాలర్ జోరు, ద్రవ్యోల్బణ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పసిడి ధరలు మరింత దిగొచ్చే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

వెండి ధరలు కూడా.. 

బంగారంతో పాటు వెండి ధరలోనూ గణనీయమైన తగ్గుదల కనిపించింది. సోమవారం కిలో వెండి ధర రూ.2,31,698గా ఉండగా.. మంగళవారం రూ.3,896 తగ్గి రూ.2,27,802కు చేరింది. పారిశ్రామిక రంగం నుంచి డిమాండ్, పెట్టుబడిదారుల ఆసక్తి, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ధరల కదలికలు వంటి అంశాల్లో మార్పులు జరగడంతో బులియన్ మార్కెట్లో వెండి ధరల్లో తరచూ హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి.  ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ అనూహ్యంగా పుంజుకుంది. సాధారణంగా డాలర్ బలపడితే బంగారం ధరలు తగ్గుముఖం పడతాయి. 
 

గత వారం రోజులుగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బంగారం ధరలు ఇలా..   

తేదీ    22 క్యారెట్ల గోల్డ్    24 క్యారెట్ల గోల్డ్ 
    (10 గ్రాములు)    (10 గ్రాములు)

సెప్టెంబర్ 20    ₹1,42,850    ₹1,55,840 
సెప్టెంబర్ 21    ₹1,41,700    ₹1,54,580
సెప్టెంబర్ 22    ₹1,40,550    ₹1,53,330
సెప్టెంబర్ 24    ₹1,39,950    ₹1,52,680
సెప్టెంబర్ 27    ₹1,39,950    ₹1,52,680
సెప్టెంబర్ 28    ₹1,37,650      ₹1,50,170
సెప్టెంబర్ 29     ₹1,36,400    ₹1,48,800