- కేటీఆర్‌కు కవిత కౌంటర్
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ అధినేత కేసీఆర్‌ను బహిరంగంగా తప్పుబట్టడం పార్టీ వ్యతిరేక చర్య కాదా? అని ప్రశ్నించారు. ఈ మేరకు కేటీఆర్ వైఖరి, వ్యాఖ్యలను ఎండగడుతూ మంగళవారం ఆమె ‘ఎక్స్’లో పలు సూటి ప్రశ్నలు సంధించారు. తాను పార్టీలోని ఒక అవినీతి నాయకుడిని విమర్శిస్తే కొద్ది గంటల్లోనే సస్పెండ్ చేశారని, అలాంటిది అదే వ్యక్తితో అంటకాగుతూ అధినేత తీరు వల్లే పార్టీకి నష్టం జరిగిందని కేటీఆర్ బహిరంగంగా వ్యాఖ్యానించడం క్రమశిక్షణారాహిత్యం కిందకు రాదా? అని నిలదీశారు. కేసీఆర్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను బాహాటంగా తప్పుపట్టడం ముమ్మాటికీ పార్టీ వ్యతిరేక చర్యేనని స్పష్టం చేశారు.
అహంకారం, అవినీతితోనే పార్టీకి నష్టం
కేటీఆర్ అక్రమ ఫామ్‌హౌస్‌లు, నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులు, ఆంధ్రా కాంట్రాక్టర్లు, -మిత్రులకు కట్టబెట్టిన నజరానాలు, క్విడ్ ప్రో కో దందాలే పార్టీని పాతాళంలోకి నెట్టాయని కవిత ఆరోపించారు. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో ఓ రైతు ఫోన్ మాట్లాడుతుంటే ‘నీ పెండ్లామా? అంత అర్జెంటా?’ అంటూ అహంకారంతో ఒక మహిళను, గతంలో సాయం కోరి వచ్చిన మరో మహిళను ‘నా కోసం కన్నావా’ అని అమ్మతనాన్ని అవమానించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఓ అవినీతి నేత ఆడుతున్న మైండ్ గేమ్‌లో పడి గుడ్డిగా పార్టీ అధినేతనే తప్పుబడుతూ బీఆర్‌ఎస్‌కు గోతులు తవ్వుతున్నారని మండిపడ్డారు.
కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నట్టుగా.. తన వైఫల్యాలను, అసమర్థతను పార్టీ అధినేత కేసీఆర్‌పై మోపుతున్నారని, దీన్నిబట్టే ప్రత్యక్ష రాజకీయాల్లో కేటీఆర్ స్థానం ఏమిటో స్పష్టమవుతోందని ఎద్దేవా చేశారు. వినాయక నిమజ్జనోత్సవంలో తమ ప్రచారం కోసం ఎంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను బతిమాలుకున్నారో కేటీఆర్ అంతరాత్మకే తెలుసని చురకలంటించారు. తాను ఎవరి మాటలో విని మాట్లాడటం లేదని, ఆధారాలతోనే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. ‘నాతో పెట్టుకోవద్దు’ అంటూ కేటీఆర్‌ను హెచ్చరించారు.
